ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఆర్ధిక ఫలితలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 11 శాతం పెరిగి 10,846 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ 9,769 కోట్లు నికర లాభం వచ్చింది. ఈ త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం 19.1 శాతం పెరిగి 58,229 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 48,885 కోట్లుగా ఉంది. ఉద్యోగ వలసలు కూడా 21.5 శాతం నుంచి 21.3 శాతానికి తగ్గినట్లు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథ్ తెలిపారు. ఈ త్రైమాసికంలో 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. అనేక పెద్ద డీల్స్ ఇందులో ఉన్నాయని తెలిపింది. ఈ త్రైమాసికంలో వృద్ధికి ప్రధానంగా సప్లయ్ చైన్, ఎఫ్‌అండ్‌ఏ బిజినెస్, డిజిటల్ వర్క్ స్పెస్ సర్వీసెస్ నుంచి వచ్చినట్లు తెలిపింది. నార్త్ అమెరకా, యూకే బిజినెస్ గ్రోత్ కొనసాగుతుందని రాజేష్ గోపినాథన్ చెప్పారు.
కొనసాగుతున్న అనిశ్చితిలోనూ రానున్న కాలంలో కంపెనీ మెరుగైన పనితీరును కనబరుస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.
ఒక్కో షేరుకు రూ 75 డివిడెండ్ వాటాదారులకు టీసీఎస్ డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ మధ్యంతర డివిడెండ్ 8 రూపాయలు ప్ర కటించింది. ఒక్కో షేరుపై స్పెషల్ డివిడెండ్ రూ 67తో కలుపుకుని మొత్తం రూ 75 డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు రికార్డు డేడ్ను జనవరి 17గా కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లింపులు చేయనున్నట్లు టీసీఎస్ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు సోమవారం నాడు 3.35 శాతం లాభపడి 3,319.79 రూపాయలకు చేరింది. 2022, డిసెంబర్ 31 నాటికి టీసీఎస్‌లో 6,13,974 మంది ఉద్యోగులు ఉన్నారు. గత సంవత్సరం ఇదే త్రైమాసికం కంటే ప్రస్తుతం 2,197 మంది ఉద్యోగులు తగ్గారు. నైపుణ్యాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా ఉత్పాదకను పెంచుకోగలిగినట్లు కంపెనీ తెలిపింది.