మార్కెట్‌లోకి వస్తున్న అత్యాధునిక టూల్స్ ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా చాట్‌జీపీటీ వంటి అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వంటి టూల్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు వస్తుందని ఇటీవల కాలంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై ప్రముఖ టెక్ సంస్థ స్పందించింది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ కేవలం ఏఐ సహోద్యోగిగా మాత్రమే పని చేస్తాయని, ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపర్చడంలో ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయని, కంపెనీల బిజినెస్ మోడల్స్‌ను మాత్రం మార్చలేవని టీసీఎస్ అభిప్రాయపడింది.
పదాలు, ఇమేజ్, ఆడియో, సింథెటిక్ డేటాను ఉత్పత్తి చేసే ఒక రకమైన కృత్రిమ మేథనే జనరేటివ్ ఏఐగా పరిగణిస్తారు. ఏఐ అనేది కో-వర్కర్‌గా మాత్రమే ఉంటుందని, కస్టమర్లను అర్ధం చేసుకునేందుకు అది కొంత సమయం తీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయలేవని, కాని ఉద్యోగ నిర్వచనాలు మాత్రం మారుతాయని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్‌ఓ మిలింద్ లక్కాడ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కోసం చాట్‌జీపీటీ మంచిదేనని, ఉద్యోగులకూ ఇది సహకారంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఇటువంటి టూల్స్ వచ్చినప్పటికీ, బిజినెస్ మోడల్‌ను మాత్రం మార్చలేవని మిలిండ్ లక్కాడ్ స్పష్టం చేశారు.
ఉత్పాదకత పెంచడం, పనిలో స్థిరత్వం, పాలనా అవసరాన్ని తగ్గించడం, వేగంగా డెలివరీ చేయడం వంటి వాటికి ఇటువంటి టూల్స్ ఎంతో దోహదపడతాయని చెప్పారు. టీసీఎస్ ఇప్పటికే ఇటువంటి కొన్నింటిని వినియోగిస్తోందన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో వీటి పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. చాట్‌జీపీటీ అనేది ఎంతో విప్లవాత్మకమైన, అత్యంత ఉత్పాదకతను కలిగించేదేనని, ఐసీఆర్‌ఐఈఆర్ ఛైర్మన్, జెన్‌పాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ బాసిత్ పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో ఉద్యోగులు వీటిని ఏవిధంగా వినియోగించాలనే విషయంపై నిబంధనలు, విధానాలపై త్వరగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కంపెనీలు , సంస్థలు, వీటి వాడకం గురించి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేథ, చాట్‌జీపీటీలపై కొన్ని భయాలు ఉన్నాయని, ఈ రెండు విభాగాలు కొత్తగా ఉపాధి, అధిక ఉత్పాదకత కలిగిన ఉద్యోగాలను స్పష్టిస్టాయని ప్రమోద్ భాసిన్ చెప్పారు.