ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండు సంవత్సరాల్లో కొత్తగా 1,50,000 మంది ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను ఉద్యోగంలోకి తీసుకుంది. గత రెండు సంవత్సరాలుగా సప్లయ్ సవాళ్లు ఉన్నతస్థాయికి చేరినప్పటికి సంస్థ కొత్త ఉద్యోగులను తీసుకుందని టీసీఎస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో టీసీఎస్ 1,10,000 మందిని, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. వీరికి డిమాండ్ ఉన్న టెక్నాలజీపై శిక్షణ ఇచ్చినట్లు ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేసిన రాజేష్ గోపినాథన్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,000 చేరింది. టీసీఎస్ ఈ కాలంలో ఉద్యోగులకు 5-8 శాతం వేతనాలు పెంచిందని తెలిపారు. ఏఐ టెక్నాలజీతో సవాళ్లు ఎదురవుతున్నందున ఉద్యోగుల నైపుణ్యాలను మరింత పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది ఇండియాలో 6-9 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అంతకు ముందు సంవత్సారాల్లో నైపుణ్యాలపై ఇచ్చిన శిక్షణను 2022-23లో ఉపయోగించుకున్నట్లు నివేదిక తెలిపింది. క్లౌడ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను అత్యధిక ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలిపింది.
రాజేష్ గోపీనాథన్‌కు 29.16 కోట్ల వేతనం టీసీఎస్ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్‌కు గత ఆర్ధిక సంవత్సరంలో వార్షిక వేతనంగా 29.16 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది 13.17 శాతం అధికం. 2022-23లో గోపినాథన్‌కు 25 కట్ల క మీషన్ వచ్చింది. దీనితో పాటు 1.73 కోట్లు వేతనంగా, 2.43 కోట్లు ఇతర ప్రయోజనాల కింద పొందినట్లు టీసీఎస్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. గోపీనాథన్ 6 సంవత్సరాల పాటు సీఈఓగా 2023 మే 31 వరకు కొనసాగారు. బాధ్యతల రీత్యా ఆయన కంపెనీలో సెప్టెంబర్ వరకు కొనసాగనున్నారు. గోపీనాథన్ స్థానంలో సీఈఓగా కె.కృతివాసన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు నెలకు 10 లక్షల రూపాయల మూల వేతనం అందనుంది. ఇది 16 లక్షల వరకు పెరగనుంది. వీటితో పాటు కమిషన్, ఇతర ప్రయోజనాలను బోర్డు నిర్ణయించనుంది.
ఏఐలో భారీ పెట్టుబడులు…
వ్యాపారాల్లో కృత్రిమ మేథ వంటి అత్యాధునిక టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతుందని టీసీఎస్ ఛైర్మన్ ఎస్.చంద్రశేఖరన్ చెప్పారు క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ వంటి వాటిలో ఉన్న శక్తిని కంపెనీలు వినియోగిస్తున్నాయని చెప్పారు. టీసీఎస్ ఈ టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ పరిస్థితుల్లోనూ టీసీఎస్ 17.6 శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. 34.1 బిలియన్ విలువ చేసే ఆర్డర్లలో గత ఆర్ధిక సంవత్సరాన్ని బలంగా ముగించినట్లు తెలిపారు.
పరిశ్రమలు, వ్యాపారాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఏఐ సాంకేతికతో పెట్టుబడులు పెడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. కొత్త టెక్నాలజీపై పెట్టుబడులే ఐటీ ఇండస్ట్రీ వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత ఉత్పత్తులపై టీసీఎస్ దృష్టి సారించిందన్నారు. కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా సంస్థ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు.