ద్రవ్యోల్బణం నియంత్రణకు పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నుల్లో కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఈ పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ వివరాలు తెలిసిన తరువాత కేంద్రంపై దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరిలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం జనవరిలో మూడు నెలల గరిష్టానికి 6.52 శాతానికి చేరింది. ఒక పక్క ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని ఆర్బీఐ ఇటీవలే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా వడ్డీ రేట్లను భారీగా పెంచడం వల్ల దాని ప్రభావం పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాలపై పడుతుందని ఆర్దిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు ఉత్పత్తిని దెబ్బతీస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్రం చమురు, మొక్కజొన్న వంటి వాటిపై ఉన్న పన్నులను తగ్గించే అవకాశం ఉందని ఆ వార్తా కథనం తెలిపింది.
ప్రధానంగా చమురు ధరలు, మొక్కజోన్న, ధాన్యాల ధరలు ఎక్కువగా ఉండటంతోనే ద్రవ్యోల్బణం అధికంగా నమోదైందని ఆర్బీఐ తెలిపింది. దిగుమతి చేసుకుంటున్న మొక్కజొన్నపై కేంద్ర ప్రభుత్వం 60 శాతం వరకు దిగుమతి సుంకం విధిస్తోంది. దీని దేశీయ మార్కెట్లో వాటి ధరలు అధికంగా ఉంటున్నాయి. ఈ పన్నును తగ్గించడం వల్ల మొక్కజొన్న ధరలు తగ్గి, ఆ మేరకు ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. దేశీయ అవసరాల కోసం మన మూడో వంతు చమురును దిగుమతి చేసుకుంటున్నాం. చమురుపై కేంద్రం విధించే పన్నులు, రాష్ట్రాలు విధించే పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరల్లో ఊరట కల్పిస్తే ఇంధన ధరలు తగ్గుతాయి. వీటి ధరలు తగ్గితే చాలా రంగాలపై సానుకూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రవాణా రంగానికి ప్రయోజనం చేకూరుతుంది. ఫలితంగా ఆహార ధాన్యాలతో పాటు, చాలా వస్తువుల ధరలు కూడా కొంతమేర తగ్గుతాయి.
ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. తగ్గిన ఇంధన ధరలను వినియోగదారులకు బదిలీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆర్బీఐ కేంద్రానికి సూచించింది. గతంలోనూ ఇలాంటి సూచనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ప న్నులు తగ్గించింది. గత సంవత్సరం మే నెలలో కేంద్రం పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. ఇదే బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత మన దేశంలో ద్రవ్యోల్బణ భారీగా పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ఓల రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతం, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 15 శాతానికి పెరిగింది. దీంతో ఆర్బీఐ రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. అప్పటి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ రెపోరేటు పెంచుతూ వస్తోంది. ఆర్బీఐ సూచన మేరకు కేంద్రం అప్పుడు పెట్రోల్, డీజిల్‌పై కొంత సుంకాన్ని తగ్గించింది.
తాజాగా ఇప్పుడు 2022 డిసెంబర్లో 5.72 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతానికి చేరింది. దీంతో వచ్చే ఎంపీసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లును ఆర్బీఐ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్బీఐ సూచనల మేరకు మరోసారి కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న సుంకాల్లో కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల పండ్లు, కూరగాయలు, పాలు, సోయా ఆయిల్, ఇతర వంటనూనెలు, నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం లెక్కలు వెల్లడి అయ్యాక కేంద్రం సుంకాలు తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సైతం చెబుతున్నాయి.