Friday, November 22, 2024

తాటి ముంజలు భలే మజా.. వేసవి తాపానికి ఉపశమనం

ప్రభన్యూస్ : తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే. ఎండకాలం వచ్చిందంటే చాలు పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి, నోరూరిస్తాయి. తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్‌ ఆపిల్స్‌’ అంటూ ఆపిల్‌ పండ్లకు సరిసమానమైన స్థానం ఇచ్చారు. తాటి ముంజల్ని తాటికన్నులు అనీ అంటారు. పోషకాల్లో మేటి అయిన ముంజల ముచ్చట్లు..

తాటిముంజల మజాయే వేరులే…

ఐస్‌ యాపిల్‌ లేదా తాటి ముంజలు. ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. సిటీల్లో ఆకుల మధ్యలో ఉంచి అమ్ముతుంటారు. లేత తాటి ముంజలు ఎండ వేడిమి నుంచి కాపాడతాయి. తాటిముంజలు తినడం కూడా ఓ స్టైలే. పట్టణాలు, నగరాల్లో స్పూన్లు, ఫోర్కులతో తింటారు. కానీ, పల్లెల్లో అప్పటికప్పుడు తాటికాయ ఒలిచి బొటన వేలితో తీసుకుని తింటుంటే ఆ మజాయే వేరు. మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి. గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజలు విరివిగా దొరుకుతుంటాయి. సిటిల్లో మాత్రం భారీ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సిందే.

తక్షణ ఎనర్జీ!

వేసవి అంటేనే మండే ఎండలు. భానుడి ప్రతాపం నుంచి బయట పడేందుకు రకరకాల దారులు వెతుకుతుంటారు. కడుపులో ‘చల్లచల్లగా ఏం వేద్దామా’ అని ఎదురు చూస్తుంటారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు ఓ చక్కటి పరిష్కారం తాటిముం జలు. వీటిలో నీటి శాతం పుష్కలం. నాలుగు ముంజలు గుటుక్కు మనిపిస్తే ‘డీహైడ్రేషన్‌’ సమస్యే ఉండదని నిపుణులు తేల్చారు. అదనంగా తక్షణ ఎనర్జీ!

- Advertisement -

తాటి ముంజల వల్ల మేలు అంతా ఇంతా కాదు…

మన దాహార్తిని తీర్చి, శరీరానికి చల్లదనాన్నిస్తాయి. ఎన్నో పోషకాలనూ అందిస్తాయి. తాటిముంజల్లో విటమిన్‌-బి, ఐరన్‌, క్యాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటిముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి ఎండకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజల్ని కనుక తింటే, ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటారు. తాటి ముంజలకు ఔషధగుణం ఉంది. లివర్‌ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇవి మరింత మంచి ఆహారం.

పొట్టు తీయకుండా తినాలి..

చాలామంది ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.కొబ్బరిని ఇష్టపడే వాళ్లంతా తాటిముంజల్నీ ఇష్టపడతారు. దీని రుచి లేత కొబ్బరి మాధుర్యాన్ని తలపిస్తుంది. అలసిన వేళ ముంజలు మహాశక్తినిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవిలో తాటిముంజలకు జైకొడదాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement