టాటాగ్రూప్స్ కీలక ప్రకటన చేసింది. లక్షదీప్‌లోని సుహేలీ, కద్మత్ దీవులలో తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేయనున్నట్టు టాటా గ్రూప్ ఆతిథ్యరంగ అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) ప్రకటించింది. ఈ రెండు రిసార్టులను 2026లో ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐహెచ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ ఛత్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అరేబియా సముద్రం మధ్యలో ఉన్న లక్షదీప్ సహజమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకర్షించగలవని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. సుహేలిలో నిర్మించనున్న తాజ్ రిసార్టులో 60 బీచ్ విల్లాలు, 50 వాటర్ విల్లాలు సహా 110 గదులు ఉండనున్నాయి. ఇక కద్మత్ ద్వీపంలో ఏర్పాటు చేయనున్నట్టు తాజ్ రిసార్టులో 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలను ఏర్పాటు చేయనున్నారు. మరో లగ్జరీ రిసార్ట్ సంస్థ ‘ప్రవేగ్’ కూడా లక్షద్వీప్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది.