Monday, November 25, 2024

ప్రపంచం ఐటీ సర్వీసెస్‌ కంపెనీల్లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా.. ఐటీ కంపెనీల్లో గ్లోబల్‌ నెం 2

ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన ఐటీ సర్వీసెస్‌ కంపెనీల్లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 2వ స్థానంలో నిలిచింది. అత్యధిక విలువ కలిగిన కంపెనీగా, దృఢమైన ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్‌గా యాక్సెంచర్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు బ్రాండ్‌ ఫైనాన్స్‌ 2022 గ్లోబల్‌ 500 రిపోర్ట్‌ వెలువడింది. ఈ జాబితాలో మరో దేశీయ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మూడో స్థానంలో నిలిచి ఆకట్టుకుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న కంపెనీగా ఇన్ఫోసిస్‌ నిలిచింది. గతేడాది కాలంలో ఇన్ఫోసిస్‌ వ్యాల్యూ 52 శాతం మేర పెరిగగా.. 2020 నుంచి ఇప్పటివరకు 80 శాతం మేర వృద్ధి చెంది 12.8 బిలియన్‌ డాలర్లకు చేరిందని రిపోర్ట్‌ వివరించింది. టీసీఎస్‌ వ్యాపార ప్రదర్శన, విజయవంతమైన భాగస్వామ్యాలు దోహదం చేయడంతో కంపెనీ వ్యాల్యూ 16.8 బిలియన్‌ డాలర్లుగా ఉందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ రిపోర్ట్‌ పేర్కొంది. రిపోర్ట్‌ ప్రకారం.. గత 12 నెలల్లో టీసీఎస్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 1.844 బిలియన్‌ డాలర్లు(12.5 శాతం) మేర పెరిగి 16.786 బిలియన్‌ డాలర్లకు చేరాయని తెలిపింది. తన బ్రాండ్‌, ఉద్యోగులు, కస్టమర్‌ ఈక్విటీలో కంపెనీ పెట్టుబడులు, దృఢమైన ఫైనాన్స్‌ ప్రదర్శనతో ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ రిపోర్ట్‌ పేర్కొంది. కాగా బ్రాండ్‌ ఫైనాన్సింగ్‌ ర్యాంకింగ్‌లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఎగబాకడంతో ఐబీఎం నాలుగవ స్థానానికి దిగజారింది. ప్రస్తుతం ఐబీఎం బ్రాండ్‌ వ్యాల్యూ 10.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోల్చితే 34 శాతం మేర క్షీణత నమోదయ్యింది. 2020 నుంచి 50 శాతం మేర తగ్గుదల నమోదయ్యిందని కంపెనీ పేర్కొంది. యూఎస్‌కు చెందిన బహుళజాతి కంపెనీ ఐబీఎం వ్యాల్యూయేషన్‌ క్రమంగా తగ్గుతోంది. కిండ్రిల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నాటి నుంచి విలువ క్షీణత కనిపిస్తోంది. కిండ్రిల్‌ విక్రయంతో ఐబీఎంకి 19 బిలియన్‌ డాలర్ల ఆదాయ నష్టం జరిగింది. దీంతో ఐబీఎం వ్యాల్యూ భారీగా తగ్గడానికి కారణమైంది.

యూఎస్‌ కంపెనీలతో పోటీ
గత రెండేళ్లుగా బ్రాండ్‌ వ్యాల్యూ వృద్ధి విషయంలో ఇండియన్‌ ఐటీ కంపెనీలు అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజాలతో పోటీపడుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి దారితీసిన పరిస్థితుల కారణంగా డిజిటల్‌ రూపాంతరతలో భాగంగా ఇరు దేశాల ఐటీ కంపెనీలు పోటీపడుతున్నాయని రిపోర్ట్‌ పేర్కొంది. ఇండియన్‌ బ్రాండ్‌ల సగటు వృద్ధి 2020 తర్వాత ఆకర్షణీయంగా 51 శాతంగా ఉంది. ఇదే సమయంలో యూఎస్‌ కంపెనీలు సగటు మైనస్‌ 7 మేర క్షీణించాయని రిపోర్ట్‌ వెల్లడించింది. వ్యాపారాలపై కొవిడ్‌ గ్లోబల్‌ మహమ్మారి,, దాని అనివార్య ప్రభావాలు ఉన్నప్పటికీ ఐటీ సర్వీసులు, టెక్నాలజీ రంగం అద్భుతమైన ఫలితాలను ప్రకటించాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ రిపోర్ట్‌ పేర్కొంది. మార్కెట్‌ వాటాను పొందేందుకు భారత్‌ నుంచి ప్రపంచ దేశాల కంపెనీలు క్లౌడ్‌ సర్వీసులు, టెక్నాలజీ కన్సల్టింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్స్‌పై దృష్టిసారించాయి. భవిష్యత్‌లొనూ కొవిడ్‌ సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐటీ కంపెనీలు నిరూపించాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ వ్యాల్యూయేషన్‌ డైరెక్టర్‌ సావియో డీసౌజా అన్నారు.

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ హర్షం
మార్కెట్‌కు సంబంధించి పెరుగుతున్న వ్యాల్యూకి వచ్చిన ర్యాంకింగ్‌ ఎంతో విలువైనదని టీసీఎస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రాజశ్రీ అన్నారు. ఆవిష్కరణలు, తమ క్లయింట్లకు డిజిటల్‌ రూపాంతరతపై టీసీఎస్‌ దృష్టిసారించిందని వివరించారు. కొత్త బ్రాండ్లను నమ్మకంపై రూపొందించామని చెప్పారు. మున్ముందు అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ క్లయింట్లలో డిజిటల్‌ రూపాంతరతను కోరుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. బ్రాండ్‌ ఫైనాన్సింగ్‌ ర్యాంకింగ్‌లో పురోగతిపై ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ ఫరేఖ్‌ హర్షం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా తమ క్లయింట్లు వేగంగా డిజిటల్‌ రూపాంతరతను అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. ఇన్ఫోసిస్‌ సామర్థ్యంపై క్లయింట్లకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

బ్రాండ్‌ ఫైనాన్స్‌ రిపోర్ట్‌లోముఖ్యాంశాలు.

  1. టిక్‌టాక్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న బ్రాండ్‌.
  2. ప్రపంచంలో అత్యధిక వ్యాల్యూయేషన్‌ కలిగిన బ్రాండ్‌ యాపిల్‌.
  3. టెక్‌ రంగం అత్యధిక విలువైన ఇండస్ట్రీగా ఉంది. 1 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేరువైన రిటైల్‌ రంగం రెండో స్థానంలో ఉంది.
  4. బ్రాండ్‌ వ్యాల్యూలో మూడింట రెండొంతులు చైనా, అమెరికా కంపెనీ ఆధిపత్యమే.
  5. బ్రాండ్‌ ఫైనాన్స్‌ బ్రాండ్‌ గార్డియన్‌షిప్‌ ఇండెక్స్‌ 2022లో మైక్రోసాప్ట్‌ సత్య నాదెళ్లకు తొలి స్థానం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement