ఎలక్ట్రిక్ వాహనాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈనేపథ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారీ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది . టాటా మోటార్స్ వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ నెక్సాన్ వంటి వాహనాలతో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, రాబోయే కాలంలో ఈ విభాగంలో మరో 10 కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయనుందన్నారు. ఈక్రమంలో వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని శైలేష్ చంద్ర తెలిపారు. ఇందులో వివిధ రకాల బాడీ స్టైల్స్, ధరలు, డ్రైవింగ్ రేంజ్ ఆప్షన్‌లతో దాదాపు 10 ఉత్పత్తులపై పని చేయబోతున్నామని అన్నారు. ఔరంగాబాద్ మిషన్ ఫర్ గ్రీన్ మొబిలిటీ కార్యక్రమంలో భాగంగా 101 ఎలక్ట్రిక్ వాహనాల బ్యాచ్ నగరవాసులకు డెలివరీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 250 ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్డర్ చేసినట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల ప్రొఫైల్ వేగంగా మారుతుందని, చాలామంది కొనుగోలుదారులు మొదటిసారి కారును కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించేవారి సంఖ్య 65 శాతానికి పెరిగిందన్నారు. టాటా మోటార్స్ ఇప్పటివరకు 22,000 ఎలక్ట్రిక్ వహనాలను విక్రయించిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..