ఇజ్రాయేల్ క్షిపణులు దాడులలో అతడి కుమార్తె కూడా మరణం
అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ప్రధాని నెతన్యాహు
అనుకున్నది సాధించిన ఇజ్రాయేల్
లెబనాన్ లో హిజ్ బుల్ ఆనవాళ్లు తుడిచేందుకు ముందడుగు
ఇక భూతల యుద్దానికి రెడీ గా ఇజ్రాయేల్
హిజ్‌బొల్లా అధినేత హస్సన్ నస్రల్లా ఇజ్రాయేల్ జరిపిన క్షిపణి దాడిలో మరణించారు. ఆయనను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. అతడు ఉంటున్న నేల మాలిగపై ఏకంగా 60 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారికంగా ధ్రువీకరించింది. తాము చేసిన దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు వెల్లడించింది.
కాగా, నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బీరుట్ లో ఉన్న బిల్డింగ్‌లను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులకు పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్‌బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. అండర్‌గ్రౌండ్ హెడ్‌క్వార్టర్స్‌లో దాక్కున్న నస్రల్లా ఆ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, తాజా దాడుల్లో నస్రల్లాకు ఏమీ కాలేదని హిజ్‌బొల్లా వర్గం వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే తమ దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. ‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’ అంటూ ఐడీఎఫ్ ట్వీట్ చేసింది. మరోవైపు తాజా దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి చెందారని కూడా ప్రకటించింది.. ఇప్పటి వరకు గగనతలంలో యుద్దం చేసిన ఇజ్రాయేల్ ఇప్పుడు లెబనాన్ లోకి పదాతి దళాలను పంపనుంది.. ఇప్పటికే లెబనాన్ సరిహద్దులలో భారీగా సైన్యాన్ని, యుద్ద ట్యాంకులను మొహరించింది.. హిజ్‌బొల్లా అనవాళ్లు పూర్తిగా తుడిచేసేందుకే తాము లెబనాన్ అడుగుపెడుతున్నట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.