అమరావతి, ఆంధ్రప్రభ : సినీ నటుడు నందమూరి తారక రత్న ఆరోగ్యం పూర్తిగా విషమించినట్లుగా సమాచారం. గత నెల 27న కుప్పంలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న తీవ్ర గుండె పోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గడిచిన 23 రోజులుగా నారాయణ హృదయాలయ వైద్యులతో పాటు విదేశీ వైద్యులు కూడా ఆయనకు చికిత్స చేస్తున్నారు. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్ధితి మరింత దిగజారినట్లుగా వైద్యులు వెల్లడించారు. తీవ్ర గుండెపోటుకు గురవ్వడంతో ఆయన నాడీ వ్యవస్ద దెబ్బతిన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
అప్పటి నుంచి కోమాలో ఉన్న తారకరత్నను దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వైద్యులు ప్రయత్నించారు. కొద్ది రోజులు వైద్యానికి స్పందించిన తారకరత్న శరీరం ప్రస్తుతం స్పందించడం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులతో వైద్యులు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బెంగుళూరులో ఉన్న ఆసుపత్రికి చేరుకోగా బంధువులు కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. ముఖ్యంగా తారకరత్న పరిస్దితి క్రిటికల్ గా ఉండటంతో హైదరాబాద్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులు యోచిస్తున్నట్లుగా సమాచారం.
అయితే తారకరత్న ఆరోగ్య పరిస్దితిపై వైద్యులు ఇంతవరకూ ఎలాంటి బులిటెన్ ను అధికారికంగా విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉం డే వ్యక్తులు తారక రత్నను ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తరలించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. శనివారం కూడా తారకరత్నకు బ్రెయిన్ స్కాన్ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు పరిస్ధితి మరింత విషమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.