Friday, November 22, 2024

అక్కాచెల్లెళ్ల లేఖకు స్పందించిన సీఎం స్టాలిన్.. రూ.8 లక్షలు కేటాయింపు

తమ గ్రామంలో తాగునీటి వసతిని కల్పించాలని ఇద్దరు బాలికలు ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్‌’కు రాసిన లేఖకు స్పందించిన స్టాలిన్‌ వారి గ్రామంలో తాగునీటి వసతి కోసం రూ.8 లక్షలు కేటాయించారు. తిరువారూర్‌ జిల్లా కోట్టూరు సమీపంలోని వాత్తార్‌ గ్రామానికి చెందిన అన్బళగన్‌ కుమార్తెలు కయల్‌విళి 8వ తరగతి, చిన్న కుమార్తె కార్‌కుయిలి 6వ తరగతి చదువుతున్నారు. ఆ గ్రామంలో పర్యటించిన స్టాలిన్‌కు కయల్‌విళి, కార్‌కుయిలి అందజేసిన వినతిపత్రంలో, వత్తారు పంచాయితీలో పదేళ్లుగా ఉప్పు నీరు వస్తోందని, ఈ ప్రాంతంలో ఓఎన్‌జీసీ సంస్థ చేపట్టిన హైడ్రోకార్బన్‌ వెలికితీత కారణంగా భూగర్భజలాలు అడుగంటాయన్నారు.

కాలుష్యమైన నీటిని తాగడం ద్వారా పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని, తమ గ్రామంలో తాగునీటి శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో తిరువారూర్‌, మన్నార్‌గుడి డీఎంకే ఎమ్మెల్యేలు కలైవానన్‌, రాజా, ఎస్పీ సెల్వరాజ్‌ ఆదివారం ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించి.. మీ లేఖపై సీఎం స్టాలిన్ స్పందించారని, మీ గ్రామంలో తాగునీటి శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటుకు రూ.8 లక్షలు మంజూరు చేశారని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలియజేసి అక్కాచెల్లెళ్లను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement