తమిళనాడు మాజీ సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు.. వీకే శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని అన్నారు. ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం..
ప్రతిపక్ష నేత హోదాలో ఎడప్పాడి కె.పళనిస్వామి.. ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు అడగడంలేదని వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో శశికళ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను మీకు చెబుతున్నా.. సమయం ఆసన్నమైంది. ఎటువంటి ఆందోళనా అవసరం లేదు. తమిళనాడు ప్రజలు కచ్చితంగా మావైపే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దు. నా రీ ఎంట్రీ ప్రారంభమైంది’ అని తెలిపారు.
కుల ప్రాతిపదికన రాజకీయలు చేయలేదు..
కార్యకర్తల పార్టీ అన్నాడీఎంకే అని వీకే శశికళ అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అలాంటిది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరని ఆమె వ్యాఖ్యానించారు. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయ్యి ఉండేవారు కాదని అన్నారు. అందరినీ ఏకం చేసి అన్నాడీఎంకే పార్టీని బలోపేతం చేయడే తన లక్ష్యం అని తెలిపారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు.