Thursday, November 21, 2024

తమిళనాడు రాష్ట్ర‌ గీతంగా తమిళ్ థాయ్ వళతు..

మాతృభాష తమిళం గౌరవాన్ని ఇనుమపడించేందుకు అహరహం తపించే తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్నితీసుకుంది. తమిళ్ థాయ్ వళతు ఇకనుంచి రాష్ట్ర‌ గీతంగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యక్రమాలు, విశ్విద్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ వేదికలపై నిర్వహించే కార్యక్రమాల్లో విధిగా రాష్ట్ర‌ గీతాన్ని ఆలపించాలని, ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా విధిగా లేచి నిలబడాలని వెల్లడించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే దివ్యాంగులకు మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. తమిళభాష ప్రత్యేకతను చాటుతూ సాగే తమిళ్ థాయ్ వళతు గీతం 55 సెకండ్ల నిడివి ఉంటుంది.

ఇది కేవలం ప్రార్థనా గీతం మాత్రమేనని ఇటీవల మద్రాసు హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. తమిళ్ థాయ్ వళతు గీతం జాతీయగీతం కాదని, అందువల్ల దానిని ఆలపించినప్పుడు పౌరులు విధిగా లేచి నిలబడాలనేం లేదని కోర్టు వెల్లడించింది. ఈ పరిస్తితుల్లో ఇటీవల మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవంలో తమిళ్ థాయ్ గీతాన్ని ఆలపించకపోవడం, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర‌ ఉన్నత విద్యాశాఖ లేఖ రాయడం వంటి పరిణామాలు సంభవించాయి. చివరకు రాష్ట్ర‌ ప్రభుత్వం తమిళ్ థాయ్ గీతాన్ని రాష్ట్ర‌ గీతంగా ప్రకటిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement