న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లని తెలిపింది. వివిధ రాష్ట్రాల అప్పులపై బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక జవాబిచ్చారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,98,903 కోట్లు కాగా, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్లని చెప్పారు. రూ. 6,53,307 కోట్ల అప్పుతో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో, రూ. 6,08,999 కోట్ల అప్పుతో మహారాష్ట్ర మూడవ స్థానంలో, రూ. 5,62,697 కోట్లతో పశ్చిమ బెంగాల్ నాలుగవ స్థానంలో, రూ. 4,77,177 కోట్ల అప్పుతో రాజస్థాన్ ఐదవ స్థానంలో ఉన్నాయని కేంద్రమంత్రి సమాధానంలో పేర్కొన్నారు.
రూ. 4,61,832 కోట్ల అప్పుతో కర్ణాటక ఆరవ స్థానంలో ఉన్నట్టు పంకజ్ చౌదరి వివరించారు. రూ. 4,02,785 కోట్ల అప్పుతో గుజరాత్ ఏడవ స్థానంలో ఉందని చెప్పారు. 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో దేశంలో ఆరో స్థానంలో తెలంగాణ, 10.7 శాతం అప్పుల పెరుగుదలతో దేశంలో 15వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని పంకజ్ చౌదరి బదులిచ్చారు.