దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇవాళ ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్ట్‌లు మొదలగు అంశాలపై ప్రధానితో చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో, సమగ్ర శిక్షా పథకం కింద కేంద్ర నిధులను విడుదల చేయాలని, చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు తదుపరి దశకు అవసరమైన నిధులను విడుదల చేయడానికి ఆమోదం తెలపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా తమిళ మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటానికి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మోడీని అభ్యర్థించారు.
సమావేశం అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ…. ప్రధాని మోడీని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం మూడు అభ్యర్థనలు చేశాను. వీటి గురించి ప్రధానికి వివరణాత్మకంగా అన్ని తెలియజేశాను. మా మధ్య జరిగిన ఈ సంతోషకరమైన సమావేశాన్ని ఉపయోగకరమైన సమావేశంగా మార్చడం ప్రధాని మోడీ చేతుల్లోనే ఉందన్నారు.
తాను చేసిన అభ్యర్థనలకు ఆయన అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు స్టాలిన్ విలేకరులతో అన్నారు. ఇదిలా ఉంటే మోడీని కలిసిన తర్వాత, స్టాలిన్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిశారు. సీఎం వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల కోసం నిన్న సాయంత్రమే దేశ రాజధానికి చేరుకున్నారు.