ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించిన తర్వాత తొలిసారి అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా అధికారులు, సీనియర్ తాలిబన్ అధికారులు శనివారం ఖతార్‌లోని దోహాలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తర్వాత తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకుండా తాము ఆఫ్ఘన్ ప్రజలకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఇక నుంచీ తాలిబన్లను వాళ్ల మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారానే గుర్తిస్తామని చెప్పింది.
అయితే అటు తాలిబన్లు కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. చర్చల సందర్భంగా అమెరికాతో కాస్త గట్టిగానే వ్యవహరించారు. ఆఫ్ఘనిస్థాన్‌ను ఏమాత్రం అస్థిరపరచాలని చూసినా బాగుండదని ఈ సందర్భంగా అమెరికాను హెచ్చరించినట్లు తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ చెప్పాడు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రయత్నించొద్దని, అది ఎవరికీ మంచిది కాదని అమెరికాకు తేల్చి చెప్పినట్లు తెలిపాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో మంచి సంబంధాలు అందరికీ మంచిది. మా ప్రభుత్వంపై కుట్ర చేయాలని చూస్తే మిగతా ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదు అని అమీర్‌ఖాన్ అన్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ వెల్లడించింది. అమెరికాతో చర్చల సందర్భంగా ఉగ్రవాదం, ఆఫ్ఘన్‌లో విదేశీయుల భద్రతకు సంబంధించి తాలిబన్లు చర్చలు జరిపారు. బాలికలు, మహిళలకు సంబంధించి కూడా చర్చించారు.