పాకిస్తాన్లో తాలిబన్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. వాయువ్య పాకిస్థాన్లో ఖైబర్ పక్తూన్క్వాలోని ఓ కంటోన్మెంట్ ప్రాంత పోలీస్ స్టేషన్ను పాక్ తాలిబన్లు స్వాధీనం చేసుకొన్నారు. తెహక్ ఈ తాలిబన్ సభ్యులు బన్నూ కంటోన్మెంట్లో కొంత భాగాన్ని ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాట దళం (సీటీడీ)కు చెందిన 9 మంది భద్రతా సిబ్బందిని సైతం బంధించి, ఆ కేంద్రాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. కొందరు ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీటీడీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన తాలిబన్ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను సీటీడీ కాంపౌండ్ నుంచి చిత్రీకరించారు.
ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని సైతం తాము బంధించామని ఆ వీడియోలో పేర్కొన్నారు. వాళ్లను విడిచిపెట్టాలంటే, తమను క్షేమంగా దేశం దాటించి, ఆఫ్ఘనిస్తాన్ చేరేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకోసం ఒక హెలికాప్టర్ సిద్ధం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. తాలిబన్ల చెర నుంచి అధికారుల్ని విడిపించేందుకు ప్రయత్నిస్తోంది.
ఆదివారం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతవరకూ బయట నుంచి ఎలాంటి ఫైరింగ్ జరపలేదని పాక్ అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లు ఏంటో తెలుసుకుంటున్నారు. తాము మొత్తం కంటోన్మెంట్ని చుట్టముట్టామని, బన్ను జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని సైతం ఆపేశామని అంటున్నారు.