సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని టకీలా పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. సమయం దాటినా పబ్లో పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. లోపల జరుగుతున్న తతంగం చూసి పోలీసులు షాకయ్యారు. యువతి, యువకులు డీజే సాంగ్స్ కు డ్యాన్సులు చేస్తున్నారు. దీంతో అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్న 18 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పబ్ ను సీజ్ చేశారు. పబ్ లో దొరికిన వాళ్లలో 8 మంది డ్యాన్స్ గర్ల్స్, 8మంది కస్టమర్లు ఉన్నారు. డీజే అపరేటర్ తో పాటు పబ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి తీసుకుని టకీలా పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 294, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు 41 CRPC నోటీసులు ఇచ్చి వదిలేశారు. గతంలోనూ టకీల బార్ అండ్ రెస్టారెంట్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. టకీల పబ్ వ్యవహారంలో కఠిన చర్యలకు దిగారు. రాంగోపాల్ పేట్ సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సీఐని సీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. రాంగోపాల్ పేట్ SHO ఇంచార్జ్ గా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ను నియమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే సీఐను సస్పెండ్ చేశారని తెలుస్తోంది.