Thursday, November 21, 2024

మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి.. హస్తినలో బైక్ ర్యాలీ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య సంగ్రామం తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు పూర్తవుతున్న ప్రత్యేకమైన సందర్భంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు సహా ప్రతి భారతీయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులమంతా ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకెళ్లాలన్నారు. బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా త్రివర్ణ పతాకం గౌరవాన్ని కాపాడుతూ క్రమశిక్షణతో జెండా వందనం చేయాలని ఆయన సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని వారి త్యాగాల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా సమాజంలో నెలకొన్న దురాచారాలను తరిమేయడంపైనా యువత దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజవయంతం చేసే విషయంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపారు. కొద్దిసేపు ఓ బైక్ వెనుక నిలబడి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, గజేంద్ర షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, పలువురు ఎంపీలు,  పెద్దసంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement