Saturday, November 23, 2024

Big Story | వాయిదాల పర్వంలో టేక్‌హోమ్‌ రేషన్‌.. ఆగష్టు 1కి మళ్లి వాయిదా

అమరావతి, ఆంధ్రప్రభ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణీలకు ఇకపై నేరుగా ఇంటికే ముడి పోషకాహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఆచరణలో మాత్రం ఇంతవరకు అమలు కాని పరిస్థితి ఉంది. ఈ టేక్‌హోమ్‌ రేషన్‌ ప్రక్రియలో వాయిదాల పర్వం చోటు చేసుకుంటూ వస్తోంది. మూడు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం ప్రతి నెల వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది కాస్త మరోసారి వాయిదా పడింది. ఆగష్టు 1 నుంచి టేక్‌హోమ్‌ రేషన్‌ విధానాన్ని అమలు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే ఈ మేరకు అన్ని జిల్లాల ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. టేక్‌హోమ్‌ రేషన్‌ అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక కారణాలతో పాటు టెండర్ల ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడంతో ఇది కాస్త వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని వంటావార్పు నిర ్వహించి లబ్ధిదారులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం చేసేందుకు పె ద్దగా ఆసక్తి చూపకపోవడంతో శిశుసంక్షేమ శాఖ సర్వే నిర్వహించింది. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించింది. దాదాపు 90 శాతం మంది బాలింతలు, గర్భిణీలు టేక్‌హోమ్‌ రేషన్‌కు మొగ్గు చూపడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు ఇకపై ముడి సరుకుల రూపంలో పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం టేక్‌హోమ్‌ రేషన్‌ మరోసారి వాయిదా పడటంతో ఇక ఈ నెలాఖరు వరకు అంగన్‌వాడీ వర్కర్లకు వంటావార్పు తిప్పలు తప్పనిపరిస్థితి ఉంది.

- Advertisement -

ప్రత్యేక కిట్లలో పోషకాహారం..

టేక్‌హోమ్‌ రేషన్‌లో భాగంగా లబ్ధిదారులకు ప్రత్యేకమైన కిట్లను అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. బియ్యం, కందిపప్పు, నూనె, పోషకాహార కిట్లు, గుడ్లు, పాలు అన్నింటినీ ఒక ప్రత్యేకమైన బ్యాగులో ఉంచి వాటిని లబ్ధిదారులకు అందించనున్నారు. ఒక్కొక్క జిల్లాలో టేక్‌హోమ్‌ రేషన్‌కు దాదాపు 60 నుంచి 70 వేల సంచులు అవసరమైతాయని అధికారులు అంచనా వేశారు. దీనికనుగుణంగానే టెండర్లను పిలిచారు. ఈ ప్రత్యేక కిట్లు అందుబాటులోకి రాకపోవడంతోనే టేక్‌హోమ్‌ రేషన్‌ మరోసారి వాయిదా వేసినట్లుగా అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ లబ్ధిదారులకు అందించే బ్యాగ్‌లో రెండు కేజీల రాగిపిండి, కేజీ అటుకులు, పావుకిలో బెల్లం, చిక్కీలు, పావుకిలో డ్రై ఫ్రూట్స్‌, మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటర్‌ వంటనూనె, ఐదు లీటర్ల పాలతో పాటు 25 కోడిగుడ్లను అందిస్తారు. సంపూర్ణ పోషణ ప్లస్‌ లబ్ధిదారులకు వీటితో పాటు అదనపు చిక్కీలు మరో పావుకేజీ డ్రై ఫ్రూట్స్‌ అదనంగా అందించనున్నారు. ఈ పోషకాహరమంతా పూర్తి నాణ్యంగా ఉండేలా అధికారులు తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement