న్యూఢిల్లీ – రాజకీయ నాయకులు తమపై వచ్చే కొన్ని విమర్శలను లైట్ తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అన్ని విమర్శలకు అతిగా స్పందించరాదని, కొన్నింటిని పట్టించుకోకపోవడమే ఉత్తమమని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు కూడా తమపై వచ్చే ఆరోపణలు, విమర్శల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది., అదే సమయంలో వాటన్నింటినీ పట్టించుకోరాదని తెలిపింది.
ఇలాంటి విషయాలకు స్పందిస్తూ పోతే మన పని మనం చేసుకోలేమని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ఈ రోజుల్లో ఇంటర్వ్యూలలో విమర్శలు చేయడం సాధారణ వ్యవహారంగా మారిందని.. కొన్ని విషయాలను పట్టించుకోనంత దళసరి చర్మాన్ని కలిగి ఉండడం నేటి అవసరమని తెలిపింది. తనపై అస్సాం ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసిందని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ వ్యాఖ్యాత గర్గా ఛటర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తుది వాదనల కోసం విచారణ వాయిదా పడింది.