ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రధానుల చేతుల మీదుగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
డిసెంబర్ లో జరగనున్న విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్ జూబ్లీ) ఫ్లయర్, లోగో లనీ మంత్రి సైఫాబాద్ లో ఉన్న విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, పీజేటీఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య, యూనివర్సిటీ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… గతంలో యూనివర్సిటీతోపాటు అనేక విద్యావ్యవస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. చాలా ఏళ్ల తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం జరిగిందని.. ఈ అవకాశాన్ని వినియోగించుకొని విశ్వవిద్యాలయాన్ని గతం కంటే భిన్నంగా తీర్చిదిద్దాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని తుమ్మల సూచించారు. డైమండ్ జూబ్లీ వేడుకలను ఉపయోగించుకుని ఈ లక్ష్యాలను సాధించాలన్నారు.
వ్యవసాయానికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. అందుకే బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ డైమండ్ జూబ్లీ వేడుకలు యూనివర్సిటీ భవిష్యత్తును భవిష్యత్తుని నిర్ణయించేలా ఉండాలన్నారు. 60 ఏళ్లుగా సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి సలహాలు, ఆదేశాలు తీసుకొని ముందుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుంటుందని అన్నారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సు ఉండనుందని.. 28 నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకి ఆచరణలో ఉపయోగపడేలా ఈ ప్రదర్శనలు ఉండాలన్నారు.