న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి లంచాలు తీసుకోవాలంటూ కేటీఆర్ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత, చార్టర్డ్ అకౌంటెంట్ బి. వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని, బహిరంగ సభల్లోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏ పార్టీ నుంచి డబ్బు తీసుకున్నా సరే.. ఓటు మాత్రం తమ పార్టీకే వేయాలని కూడా కేటీఆర్ సూచిస్తున్నారని, ఇది కచ్చితంగా నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభపెట్టడం, లంచాలను ప్రోత్సహించడమేనని ఆయనన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తాను తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని లేఖలో పేర్కొన్నారు.