న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి బుధవారం జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మను కలిశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతల తీరు సరిగా లేదంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తనను బీఆర్‌ఎస్ నాయకులు అసభ్యకరంగా దూషించిన వీడియోలను రేఖా శర్మకు చూపించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పబ్లిక్‌గా ఎలా బయట తిరుగుతావో చూస్తామంటూ బెదిరిస్తున్నారని వివరించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై రేఖా శర్మ సానుకూలంగా స్పందించారని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని షర్మిల తెలిపారు. సీఎం కేసీఅర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళంటే వ్రతాలు చేసుకోవాలంటే, మరో మంత్రేమో మహిళలంటే మరదలితో సమానం అంటాడని చెప్పుకొచ్చారు. ఒక ఎమ్మెల్యే మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడాడని ఆమె వాపోయారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అంటూ వ్యక్తిగతంగా విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు.