చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ అలర్ట్ అవుతోంంది. చైనా నుంచి పొంచివున్న అన్ని రకాల ప్రమాదాలను బేరీజు వేసుకుంటోంది. వాటిని ఎలా ఎదుర్కొనాలి అనేదానిపై కసరత్తులు చేస్తోంది. చైనా దొంగదెబ్బ తీసే అవకాశాలే ఎక్కువని తైపీ భావిస్తోంది. మారణాయుధాల కంటే బ్యాక్టీరియా బాంబులతోనే పొరుగు దేశం భవిష్యత్ యుద్ధాలు చేస్తుందని బలంగా నమ్ముతోంది. బయోవార్ పరిస్థితుల నుంచి దేశాన్ని, ప్రజలు రక్షించుకునే చర్యలను ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొవిడ్-19వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలింది బీజింగేనని అగ్రదేశాలు అంతర్జాతీయ వేదికలపైనే నిందలేశాయి. కాబట్టి తమపైనా కొత్తరకం వైరస్‌లను లేదా బ్యాక్టీరియాలతో చైనా కుట్ర యుద్ధాలు చేయొచ్చని తైవాన్ భీతిల్లుతోంది. ఎందుకైనా మంచిదని సరిహద్దు చెక్‌పోస్టుల్లోనూ, విమానాశ్రయాల్లోనూ చైనీయులపై గట్టి నిఘా ఉంచింది. కఠినమైన క్వారంటైన్ షరతులతోనే వారిని దేశంలోకి అనుమతిస్తోంది. వీసా దరఖాస్తును ఆమోదించడం దగ్గర్నుంచి మూడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ వరకు రూల్స్‌ను కట్టుదిట్టం చేసింది. ప్రపంచమంతా కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన తరుణంలో, తైవాన్ ఎందుకిలా చేస్తోంది? అని ఆరాతీస్తే, చైనా నుంచి బయోవార్ ముప్పే ఇందుకు కారణమని వెల్లడవుతోంది.
ఆహార ఉత్పత్తులపై నిషేధం…
చైనీయులనే కాదు..ఆదేశ ఆహార ఉత్పత్తులనూ తైవాన్ అనుమానిస్తోంది. విమాన ప్రయాణికులు అలాంటి ఉత్పత్తులు తీసుకురావడానికివీల్లేదని నిబంధనలు విధించింది. కొవిడ్-19, స్వైన్‌ఫ్లూ, హెచ్1ఎన్1సహా ఇతర ఏ వైరస్ కూడా దేశంలోకి ప్రవేశిస్తుందనే భయంతోనే నిషేధించబడిన ఆహార ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను పదేపదే విమానాశ్రయాల్లో, విమానాల్లో వినిపిస్తోంది. పొరపాటున వైరస్ వాహకాలుగా ఉండే ఉత్పత్తులను తీసుకెళ్తే భారీ జరిమానాలు విధించేలా చట్టం తీసుకొచ్చింది.
అడుగడుగునా తనిఖీలు..
విమానాశ్రయం ల్యాండింగ్ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉంది. విమానం దిగిన దగ్గర్నుంచి అక్కడి అధికారుల పర్యవేక్షణలోనే కదలాల్సి ఉంటుంది. అధికారులు రక్షణ కవచాలు, హజ్మత్ సూట్లు ధరించి, ఎక్కడికి వెళ్లాలో, ఏయే తనిఖీలకు హాజరుకావాలో సూచనలు చేస్తుంటారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం తప్పనిసరిగా స్థానిక సిమ్‌కార్డును కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆర్టీ పీసీఆర్ రిపోర్టును పరిశీలిస్తారు. తాజాగా కొవిడ్ టెస్టుకు లాలాజల నమూనా సేకరిస్తారు. హోటల్ గదిలో ఎన్నిరోజులు క్వారంటైన్ ఉండాలో అధికారులు నిర్దేశిస్తారు. తైవాన్‌లో ఈ తరహా పరిస్థితులు సందర్శకులకు కొత్తగా అనిపిస్తున్నాయి. భయాలనూ రేకెత్తిస్తున్నాయి.