Tuesday, November 26, 2024

అధిక ఫీజు వసూళ్లపై ఇంజనీరింగ్‌ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ ఫైన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన సుమారు 15 నుంచి 20 కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) జరిమానా విధించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. దాదాపు 26 కాలేజీలపై ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది. అధికంగా ఎంత మంది విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేశారో అన్ని రూ. రెండు లక్షల చొప్పున జరిమానాను కమిటీ విధించినట్లు తెలుస్తోది. అయితే అధిక ఫీజులు వసూలు చేసిన కాలేజీల్లో పేరున్న కాలేజీలే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ జీవో ఉల్లంఘించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో ఫీజుల నియంత్రణ కమిటీ ఈమేరకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది.

- Advertisement -

విధించిన జరిమానాను కాలేజీలు త్వరలో కట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ అక్టోబర్‌ 19న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఫీజులను ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌ కనిష్ట ఫీజు రూ.45, గరిష్ట ఫీజును రూ.1.60 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంది. అయితే కొన్ని కాలేజీలు తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేశాయి. దీనిపై టీఏఎఫ్‌ఆర్‌సీకి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కమిటీ చర్యలు చేపట్టింది. అయితే ఈ అంశంపై కాలేజీలు కోర్టుకెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement