టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణకు ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టోర్నీకి తమ తమ దేశాల జట్ల వివరాల జాబితా ఇవ్వాలని అస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు లేఖలు రాసింది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికల్లా ఆయా దేశాల క్రికెటర్ల జట్ల జాబితాలు అందజేయాలని కోరింది. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగనుండగా, అక్టోబర్ 16న శ్రీలంక – నమీబియా మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక సూపర్ 12లో భాగంగా భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా జరుగనుంది. నవంబర్ 13న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉండగా, వరల్డ్ కప్‌కు ముందే టీమిండియా నాలుగే టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆదివారంనాటితో ముగిసింది. ఈ సిరీస్‌ను టీమిండియా- దక్షిణాఫ్రికా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగిన కీలక ఐదో మ్యాచ్ వర్షార్పణంతో రద్దయింది. ఇక టీమిండియా తదుపరి ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లు ఆడనుంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుండగా, జులై 7 నుంచి ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ టీమిండియా ఆడనుంది. జులై 29 నుంచి వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అటు తర్వాత ఆగస్టు 27నుంచి టీ20 ఆసియా కప్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు టీమిండియా జట్టును ఎంపిక చేయడం సెలెక్షన్ కమిటీకి కత్తిమీద సామే. ప్రధానంగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఎలాంటి జట్టును ఎంపిక చేయనున్నారోనని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. గత టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే టీమిండియా ఇంటి బాట పట్టగా, అభిమానాలు తీవ్ర నిరాశ చెందారు. కనీసం ఈసారైనా టీమిండియా నాకౌట్ స్టేజీకి వెళ్లాలని, తద్వారా వరల్డ్ కప్ సాధించడం సులభమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత్ మెల్‌బోర్న వేదికగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా ఏ2 జట్టుతో టీమిండియా ఆడనుంది. అక్టోబర్ 30న పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతోనూ, నవంబర్ 2న అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న మెల్‌బోర్న్ వేదికగా బీ1 టీమ్‌తో భారత క్రికెట్ జట్టు తలపడనుంది. లీగ్ దశలో రాణిస్తే… నాకౌట్ దశకు చేరుకునేది. ప్రస్తుతం టీమిండియా జట్టును పరిశీలిస్తే… ఈసారి వరల్డ్ కప్ టోర్నీ ఫేవరేట్‌గానే కనిపిస్తోందని క్రికెట్ పరిశీలికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి వరుసగా సిరీస్‌లు ఆడటం కలిసొస్తుందని క్రికెట్ దిగ్గజాలు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.