Tuesday, November 26, 2024

Cricket | శ్రీలంకతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి జట్టు ఇదే..

కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. జనవరి 3న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరుగనుండగా, 5న పుణలో రెండో టీ20, 7న రాజ్‌కోట్‌ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ల జరుగనుంది. జనవరి 10న గువహటి వేదికగా తొలి వన్డే జరుగనుండగా, 12న కోల్‌కతాలో రెండో వన్డే, 15న తిరువనంతపురంలో మూడో వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ఈ క్రమంలో రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. జనవరి 3 నుండి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యారు.

ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్‌ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. జట్టులో కొత్త వారికి స్థానం దక్కింది. ముఖేష్‌ కుమార్‌, శివమ్‌ మావి అనే ఇద్దరు యువ ఫేసర్లు మొదటిసారిగా భారత్‌ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. హార్థిక్‌ పాండ్యాతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ను కూడా అదృష్టం కలిసొచ్చింది.

టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా, వైస్‌ కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఇక జట్టు సభ్యులుగా ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావి, ముఖేష్‌ కుమార్‌లను ఎంపిక చేసింది.

- Advertisement -

ఇక‌.. టీ20 సిరీస్‌కు దూరమైన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు జనవరి 10న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. అయితే కొంతకాలంగా టీ20లు, టెస్టులకు కాకుండా కేవలం వన్డేలకు మాత్రమే ఎంపికవుతూ సారథిగా ఆడుతున్న శిఖర్‌ ధావన్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజాకు మరోసారి జట్టులో చోటు దక్కలేదు.

వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టు సభ్యులుగా కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌) హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దిప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement