దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్.. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని అన్నారు. టీ హబ్-2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టెక్నాలజీ హబ్ (టీ హబ్)ను ఏర్పాటు చేశారు. గత ఆరేండ్లలో వివిధ కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్‌లను టీ హబ్ ప్రోత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది. తాజాగా ప్రారంభిస్తున్న టీ హబ్-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించారు.