Friday, November 22, 2024

Delhi | ఖర్గేతో టీ-కాంగ్రెస్ దళిత, గిరిజన నేతల భేటీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈ నెల 26న చేవెళ్లలో తలపెట్టిన సభ కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ మంత్రి బలరాం నాయక్, గడ్డం వినోద్, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ నేత కొప్పుల రాజు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ చేవెళ్లలో జరిగే సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా దళిత, గిరిజన డిక్లరేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన నేతల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని, డిక్లరేషన్‌లో ఏయే అంశాలను పొందుపరచాలన్న విషయంపై చర్చించారు.

- Advertisement -

నేతల అభిప్రాయాలు, సూచనలను నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే దళిత బంధు, గిరిజన బంధు, పోడు భూములకు పట్టాలు వంటి చర్యలతో ఆ రెండు వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నందున, తమవైపు ఆకట్టుకోవాలంటే ఏం చేయాలన్న అంశంపై మేధోమథనం జరిగింది. తదుపరి ఈనెల 29న వరంగల్‌లో తలపెట్టిన సభలో మైనారిటీ డిక్లరేషన్ కూడా విడుదల చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. అలాగే మహిళా డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ హాజరయ్యే సభలో, ఆమె చేతుల మీదుగా విడుదల చేయాలని భావిస్తోంది.

మరోవైపు చేవెళ్ల సభలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను చేర్చుకునే కార్యక్రమాన్ని సైతం తలపెట్టినట్టు తెలిసింది. గంటన్నర పాటు జరిగిన సమావేశనం అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. దళిత, గిరిజన సమాజానికి సంబంధించి రాజకీయ, సామాజిక, ఆర్థికాంశాలపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. ఈ నెల 26న చేవెళ్ల బహిరంగ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్‌ను ఖర్గే ప్రకటిస్తారని భట్టి తెలిపారు. రాష్ట్రంలో పలు అంశాలను ఖర్గే దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement