న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలిన గుర్తులను మునుగోడు ఉపఎననికల పోటీ జాబితా నుంచి తొలగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం చేరుకున్న ఆయన, కమిషన్ సభ్యులు అనూప్ చంద్ర పాండేతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వినోద్ కుమార్‌తో పాటు రాష్ట్ర హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు కూడా ఉన్నారు.
రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు ‘కారు’ గుర్తును పోలిన ఇతర గుర్తులన్నింటినీ ఉపఎన్నికల పోటీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. గతంలో ఓసారి తమ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2011 సంవత్సరంలో రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల దృష్టికి వినోద్ కుమార్ తీసుకొచ్చారు.