ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును స్విట్జర్లాండ్ పట్టాలెక్కిం చింది. ఆల్ఫ్స్ పర్వతప్రాంతం గుండా పరుగులు తీస్తున్న ఈ రైలుబండి ఇప్పుడు గిన్నిస్ రికార్డు కెక్కింది. 100 బోగీలు కలిగిన ఈ రైలు మొత్తంగా 1.9 కి.మీ. పొడ వుంది. దీనిని రైటియన్ రైల్వే కంపెనీ నిర్వహిస్తోంది. ఫ్రీడా-బెర్డ్యున్ ప్రాంతాల మధ్య నడుపుతోంది. మలుపులతో కూడిన ల్యాండ్వాసర్ వయాడక్ట్తో సహా 48 వంతెనలు దాటుకుని గమ్యస్థానం చేరుతుంది. ఈ క్రమంలో 22 సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని సొరంగాలు పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. ఫ్రీడా-బెర్డ్యున్ మధ్య ప్రయాణానికి గంట సమయం పడుతుంది. ఔత్సాహిక రైల్వే ప్రయాణికులు ఆల్ఫ్స్ గుండా వంపులు తిరుగుతూ పరుగులు తీస్తున్న రైలుబండిని చూసేందుకు ఆసక్తిగా బారులు తీరారు.
స్విట్జర్లాండ్ ఇంజనీరింగ్ ప్రతిభను హైలెట్ చేయడానికి, స్విస్ రైల్వే 175 సంవత్సరాల వేడుకను జరుపుకునే ప్రయత్నంలో భాగంగా, అత్యంత పొడవైన ప్రయాణికుల రైలును పట్టాలెక్కించామని రేటియస్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫాసియాటి తెలిపారు. ప్రయాణికుల విభాగంలో కాకుండా, అత్యంత పొడవైన రైలు రికార్డును ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. 7.352 కి.మీ. పొడవైన గూడ్సు రైలు ఇక్కడ సేవలు అందిస్తోంది. 3.5 కి.మీ పొడవైన రవాణా రైలును ఈ ఏడాది భారతీయ రైల్వే పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. దీనిని సూపర్ వాసుకి అని పేరుపెట్టారు.