Friday, November 22, 2024

రియల్‌కు ఊపు! కేంద్ర బడ్జెట్‌పై ‘క్రెడారు’ ఆశలు..

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. గత బడ్జెట్‌లో ఆశించినట్లుగానే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పలు పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. బడ్జెట్‌లో తమకు ఇవ్వాల్సిన చేయూతపై క్రెడాయ్‌ వర్గాలు ఇప్పటికే ఒక స్పష్టమైన డిమాండ్‌ల జాబితాను తయారు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కొనసాగుతున్న రియల్‌ బూమ్‌ మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగాలంటే ఈ రంగానికి పలు రకాల పన్ను రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రెడాయ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వీలైనంత ఎక్కువ మందికి ఈ రంగంలో ఉపాధి దొరికే అవకాశముంటుందని వారు చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌పై ప్రస్తుతమున్న క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును తగ్గించడం క్రెడాయ్‌ డిమాండ్ల జాబితాలో ప్రధానమైనది.

దీంతో పాటు గృహ రుణంపై ఉన్న వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని క్రెడాయ్‌ వర్గాలు కోరుతున్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ మరింత పెరిగి ప్రస్తుత బూమ్‌ కొనసాగేందుకు అవకాశం ఉంటుం దని క్రెడాయ్‌ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. 2021లో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ రియల్‌ఎస్టేట్‌ రంగానికి ఎలాంటి వరాలు ప్రభుత్వం ప్రకటించలేదు. గతంలో ఉన్న అందుబాటు ధర గృహాల పన్ను హాలీడే, రుణానికి వడ్డీ రాయితీలను మాత్రం మరో ఏడాది పొడిగించడం తప్ప ప్రత్యేకంగా ఎలాంటి వెసులుబాటును కేంద్రం ప్రకటించలేదు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన ప్రతినిధులు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ బడ్జెట్‌లో కొత్తగా ప్రత్యక్ష, పరోక్షంగా ఎలాంటి పన్నులు విధించకపోవడం పట్ల ఊపిరి పీల్చుకున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రధాన ముడి సరుకులైన సిమెంట్‌, స్టీల్‌ ధరలు విపరీతంగా పెరిగినందున సిమెంట్‌పై ఉన్న 28శాతం జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ నిర్మాణ రంగానికి చెందిన ప్రతినిధులు ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈ అంశంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే అంశాన్ని క్రెడాయ్‌ వర్గాలు మళ్లి కోరుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మౌలిక సదుపాయాల హోదా కల్పించాలని నిర్మాణ రంగ ప్రతినిధులు కోరినా ఆ హామీకి మోక్షం లభించలేదు. అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లను అద్దెకు ఇస్తే ఆ అద్దె మీద పన్ను రద్దు చేయాలన్న డిమాండ్‌పై కేంద్రం నుంచి స్పందన రాలేదు.

ఇది కూడా చ‌ద‌వండి : భారతజట్టు తమ సత్తా నిరూపించుకోవాలి..

ఈ సారైనా మౌలిక రంగ హోదా దక్కేనా…
దేశంలో, రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారి నిరాశే ఎదురవుతోందని క్రెడాయ్‌ సభ్యులు వాపోతున్నారు. ఈసారి బడ్జెట్‌లోనైనా మౌలిక రంగం హోదా ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ అనంతరం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అటు పన్నుల పరంగా, ఇటు బ్యాంకు రుణాల పరంగా ఏదైనా ఉపశమనం దొరుకుతుందేమో అని ఆశిస్తున్నామని, అయితే అలాంటిదేమీ జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటు ధర గృహాలకు సంబంధించి ఉన్న పథకాలను కొనసాగించడం తప్ప ఇటీవలి బడ్జెట్‌లలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి ఎలాంటి ఊసే ఉండడం లేదని పేర్కొంటు న్నారు. సిమెంటుపై జీఎస్టీ తగ్గింపు, రియల్‌ఎస్టేట్‌ రంగానికి మౌలిక సదుపాయాల రంగ హోదా లాంటి హామీలను గతంలో కేంద్రం పూర్తిగా పెడచెవిన పెట్టిందని గుర్తు చేస్తున్నారు.

- Advertisement -

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోదా కల్పిస్తే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు లభించడమే కాకుండా ప్రాధాన్య రంగంలో భాగంగా రుణాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కోట్లు పెట్టుబడితో ఒక పరిశ్రమ పెడితే రెడ్‌ కార్పెట్‌ వేసి పెట్టుబడిదారు లను ఆహ్వానించే ప్రభుత్వాలు… వందల కోట్లు వెచ్చించి రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ ఎలాంటి రాయితీలు ప్రకటించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని క్రెడాయ్‌ వర్గాలు వాపోతున్నాయి. ఈసారి బడ్జెట్‌లోనైనా రియల్‌ రంగాన్ని విస్మరించకుండా ఆదుకోవా లని క్రెడాయ్‌ వర్గాలు కోరుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement