బీజేపీ అగ్రనేత, వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ నేటీ రాత్రి 7:15 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ సభ్య దేశాలతోపాటు పలు దేశాల ప్రముఖులు రానున్న నేపథ్యంలో దేశ రాజధానిలో ‘హై అలర్ట్’ ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో 9, 10న రెండు రోజుల పాటు ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రత కట్టుదిట్టం
దేశ రాజధానిని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. కొంతమంది నేరస్థులు, సంఘ వ్యతిరేక వ్యక్తులు , ఉగ్రవాదులు భారతదేశం పట్ల శత్రుత్వం కలిగి ఉన్న క్రమంలో సాధారణ ప్రజలు, ప్రముఖులు, ముఖ్యమైన సంస్థల భద్రతకు ముప్పు వాటిళ్లకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాలను కంట్రోల్ ఏరియాగా మార్చారు. సంసద్ మార్గ్, రఫీ మార్గ్, రైసినా రోడ్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, మదర్ థెరిసా క్రెసెంట్, సర్దార్ పటేల్ మార్గ్‌లలో పాస్ ఉన్న వాహనాలు మాత్రమే రావాలని సూచించారు. 500కు పైగా సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో న్యూఢిల్లీలో మొత్తం 144 సెక్షన్ విధించారు.
ప్రయాణించే మార్గాల్లో.
.రాష్ట్రపతి భవన్ లోపల ఈ కార్యక్రమం జరగనున్నందున కాంప్లెక్స్ లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసు సిబ్బందిని ‘అవుటర్ సర్కిల్’లో మోహరిస్తారు. తరువాత పారామిలటరీ బలగాలు, రాష్ట్రపతి భవన్ అంతర్గత భద్రతా సిబ్బంది ‘ఇన్నర్ సర్కిల్’లో ఉంటారు. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీసు సిబ్బందితో సహా దాదాపు 2,500 మంది పోలీసు సిబ్బందిని వేదిక చుట్టూ మోహరించేందుకు ప్రణాళిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో స్నిపర్లు, సాయుధ పోలీసు సిబ్బందిని మోహరిస్తామని ఢిల్లీలోని కీలక ప్రదేశాల్లో డ్రోన్‌లను మోహరిస్తామని మరో అధికారి అన్నారు.