ఇటీవలి కాలంలో న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని సుప్రీంకోర్టు సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువ కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టు ఓ న్యాయవాదిని కోర్టు ధిక్కారం కేసులో దోషిగా తేల్చి, 15 రోజులు జైలు శిక్ష విధించిన కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్త్తులు ఎంత దృఢచిత్తంతో ఉంటే… ఆరోపణలు అంత తక్కువ ఉంటాయని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని చోట్లా న్యాయమూర్తులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా న్యాయమూర్తులకు ఎలాంటి రక్షణ ఉండడం లేదు. చివరకు లాఠీ పట్టుకున్న కానిస్టేబుల్ కూడా వారికి రక్షణగా ఉండడం లేదు అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. న్యాయవాదికి జైలు శిక్ష విధించడంసరైనదేనని స్పష్టం చేశారు.
న్యాయవాదులు న్యాయాతీతం కాదు అని తేల్చి చెప్పారు. న్యాయప్రక్రియకు అడ్డంపడడానికి ప్రయత్నిస్తే వారు సైతం పరిణామాలు ఎదుర్కోవల్సిందేనని హెచ్చరించారు. ఇలాంటి న్యాయవాదులు న్యాయవ్యవస్థకే మచ్చలాంటి వాళ్లని, వారిపట్ల కఠినంగా వ్యవహరించకతప్పదని కూడా వ్యాఖ్యానించారు. ‘మద్రాసు హైకోర్టు న్యాయవాదిపై అక్కడి న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారంట్స్ జారీ చేశారు. హైకోర్టు సమీపంలోని ఓ టీ దుకాణంలో ఆయన కనిపించినప్పుడు ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్స్ అందించడానికి సిబ్బంది వెళ్లగా దాదాపు వంద మంది న్యాయవాదులు ఆయనకు అండగా నిలబడ్డారు. సీసీటీవీ ఫూటేజీలో అక్కడి పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి. ఆ న్యాయవాది నాన్‌బెయిలబుల్ వారంట్స్ జారీ చేసిన జస్టిస్ పీటీ ఆశాపై ఆరోపణలు చేయడం న్యాయవిరుద్ధం’ అని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..