విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ విశాఖపట్నం నగరానికే పరిమితమైన శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర తన మకాంను హైదరాబాద్ కు మార్చడానికి నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి తాను హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉంటానని స్వరూపానందేంద్ర స్వయంగా వెల్లడించారు. నిన్న (శుక్రవారం) స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవాన్ని చినముషిడివాడలోని విశాఖ శారదా పీఠంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కోకాపేటలో విశాఖ శారదా పీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖ శారదాపీఠం బాధ్యతలను వచ్చే ఏడాది.. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి అప్పగిస్తానని తెలిపారు.
తాను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిందని.. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామన్నారు. విశాఖ ఇదే తన చివరి జన్మదినోత్సవమని చెప్పారు. వచ్చే ఏడాది తన షష్టిపూర్తి కోకోటాపేలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో చేసుకుంటానని చెప్పారు. అక్కడే ఉంటూ.. ఆదిశంకరుల అద్వైత తత్వంపై పరిశోధనలు నిర్వహిస్తామని చెప్పారు.
ఆదిశంకరుల అద్వైత తత్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతుందని.. తాను కూడా కోకోటాపేలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో ఉండి పరిశోధనల్లో పాల్గొంటానని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. అయితే స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.