న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నడక మార్గంలో వచ్చే భక్తులు వన్య మృగాల దాడికి గురవుతున్న ఘటనల నేపథ్యంలో ఆ మార్గాన్ని పూర్తిగా రక్షిత జోన్‌గా మార్చాలని విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సూచించారు. చాతుర్మాస దీక్షలో భాగంగా రిషికేశ్‌లో ఉన్న తనను కలిసేందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో ఆయన ఈ మాటలు చెప్పారు. టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకోవడానికి కరుణాకర్ రెడ్డి సతీ సమేతంగా రిషికేష్ వెళ్ళారు.
విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కరుణాకర్ రెడ్డి దంపతులు కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేసారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డికి స్వరూపానందేంద్ర పలు సూచనలు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో నడకదారిని ఇటు భక్తులకు, అటు వన్యప్రాణులకు రక్షిత జోనుగా అభివృద్ధి చేయాలని అన్నారు. తక్షణ చర్యలతో భక్తులకు భద్రత కల్పించాలని తెలిపారు.
ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 700 వేద పారాయణదారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. వసతి గదుల కొరత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ సమయానుగుణంగా అన్నప్రసాదాలు అందేలా చూడాలని తెలిపారు. శ్రీవారికి సమర్పించే కైంకర్యాలపై ఎప్పటికపుడు సమిక్షించాలని సూచించారు.
ధర్మ ప్రచార పరిషత్ ద్వారా విస్తృతంగా ధార్మిక ప్రచారం సాగించాలని, యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించాలని స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. ముఖ్యంగా గిరిజన, దళిత ప్రాంతాల్లో భజన బృందాలకు సామగ్రి అందించాలని, అలాగే భజన, కోలాటం బృందాలకు ఉచిత శిక్షణ ఇచ్చేలా టీటీడీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వరూపానందేంద్ర సూచనలపై టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.