Saturday, November 23, 2024

‘స్వర్ణముఖి’ నదిలో..గంగమ్మ పరవళ్ళు

శ్రీకాళహస్తి ప్రభ న్యూస్ : శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పట్టణ ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం ఓ ఎత్తయితే ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలుగు మాడ వీధులు, అగ్రహారం కూడలి తదితర ప్రాంతాల్లో కాల్వల నుంచి రోడ్ల పైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో స్వర్ణముఖి నదిలో గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ సాగుతుంది. లోతట్టు ప్రాంతాలైన నక్కఏనుగుల గుంట, ఎం ఎం వాడ, బంగారమ్మ కాలనీ, ఎస్ డి కె నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా జలమయమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ రెవెన్యూ అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్లు లోతట్టు ప్రాంతాలన్నీ సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పురపాలక శాఖ అధికారులు సంప్రదించాలని కోరారు. రాబోయే మూడు రోజుల్లో అధికంగా వర్షం పడే సూచనలు రావడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

చెరువులు కల కల.. రైతుల్లో ఆనందోత్సాహం

ఆదివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో చెరువుల్లోకి నీరు అధికంగా వస్తున్నాయని మరో రెండు రోజులు ఇలాగే కురిస్తే చెరువుల పరిస్థితి ఏంటి అని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది పైర్లు పండించడానికి సకాలంలో వర్షాలు రావడం చాలా ఆనందంగా ఉందనిపెట్టుబడులు ఆకాశాన్ని అంటుతున్నాయని రైతులు పండించే వరి ధాన్యం కు మాత్రం ధర నిలకడ లేకుండా పోతుందని. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని అయ్యల నాయుడు చెరువు, బంగారమ్మ కాలనీ సమీపంలోని వీధులగుం ట చెరువు, విశాలక్ష్మీ కాలనీ సమీపంలోని నారాయణపురం పంచాయతీ చెరువు నిండుకుండలా పూర్తిగా నీరు చేరడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement