తిరుపతి ఉపఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు తరుపున నాయకులు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఈ నెల 14న ప్రచారం చేయనున్నారు. ఇక ఈ ఎన్నికతో తమ ఉనికి చాటాలని భావిస్తున్న బీజేపీ- జనసేన పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ నేతలు.. సీఎం జగన్ టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారు. తిరుపతి లోక్ సభ స్థానాన్ని దక్కించుకునేందుకు తెలంగాణ బీజేపీ నేతలతో సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు బీజేపీకి అండగా ఉన్న పీఠాధిపతులు కూడా ఇందులో భాగస్వామలవుతున్నారు.
తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన స్వామి పరిపూర్ణానంద.. సీఎం జగన్, చంద్రబాబు సహా రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులపైనా విమర్శలకు దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాలపై స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.
రతనాల సీమ అయిన రాయలసీమను కొందరు ఫ్యాక్షన్ గడ్డగా మార్చారని పరిపూర్ణానంద అన్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ గడ్డ అనే పేరు చెరిపేసే నాయకుడు రావాలని పరిపూర్ణానంద ఆకాంక్షించారు. రాయలసీమ నుంచి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క ముఖ్యమంత్రీ పాడుపడలేదని పరిపూర్ణానంద ఆరోపించారు. రాయలసీమ ఇప్పటికీ వెనుకపడిన ప్రాంతంగానే ఉంది. జాతీయ స్ధాయిలో ఎందుకు రాయలసీమ గుర్తింపు పొందలేదని సీమ నుంచి వచ్చిన సీఎంలను పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యమే అన్నారు. రాయలసీమను తిరిగి రతనాల సీమగా మార్చే పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే మార్పు ఇక్కడి నుంచే ఆరంభమవుతుందన్నారు.
జగన్‌పై నమ్మకంతో ఓట్లు వేసిన హిందువుల మనోభావాలను ఆయన కాపాడాలని పరిపూర్ణానంద సూచించారు. హిందువుల ప్రాధమిక హక్కుల రక్షణకు సీఎం జగన్ కట్టుబడాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆలయాల కూల్చివేతలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పింక్ డైమండ్ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం విచారణ ఎందుకు చేయటం లేదన్నారు. హిందూ సమాజానికి మంచి చేస్తానని స్టేట్ మెంట్ ఇస్తే సరిపోదని, దానిని ఆచరణలో పెట్టాలని హితవు పలికారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. టీటీడీని ఎందుకు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు, అభరణాలపై ఎందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.