ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడ ప్రకటించారు. ఈవీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఆదివారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం 2026 నాటికి రూ.10,445 కోట్లు కేటాయిస్తామని తెలిపింది. ఈ నిధులతో.. ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు తయారు చేయనున్నట్టు వివరించింది. గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకున్నట్టు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. తమ దేశ ప్రధాని ఫుమియో, భారత్ ప్రధాని మోడీ మధ్య జరిగిన ఇరు దేశాల ఎకనామిక్ ఫోరంలో ఈ ఒప్పందం కుదిరినట్టు వివరించింది. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ యెన్‌లు (సుమారు రూ.3.20 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు జపాన్ ప్రధాని ఫుమియో శనివారమే ప్రకటించారు. రక్షణ, ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించనున్నట్టు వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి.
కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..
ఈ సందర్భంగా సుజుకీ మోటార్ కార్పొరేషన్ డైరెక్టర్, అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాల తగ్గించే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తున్నదని, దీనికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్వయం సమృద్ధి భారత్ లక్ష్య సాధన బాగుందని కొనియాడారు. బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తమ అనుబంధ సంస్థ సుజుకీ మోటార్ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎంజీ) రూ.7,300 కోట్ల ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. రూ.3,100 కోట్లను 2025 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెచ్చిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గుజరాత్, హర్యానాలో ఉన్న సంప్రదాయ వాహన తయారీ కేంద్రాలకు ఏటా 22 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉందన్నారు. అదనంగా 7.5 లక్షల వాహనాలు తయారీ సామర్థ్యం కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఇక తమ మరో అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ వాహన రీసైక్లింగ్‌కు రూ.45కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..