Tuesday, November 26, 2024

Delhi: సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకం, 2047 నాటికి 1ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. ధర్మశాల డిక్లరేషన్ ఇదే!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత పర్యాటక రంగం 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా ధర్మశాలలో జరిగిన రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సు డిక్లరేషన్ పేర్కొంది. కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, ఈ రంగానికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని సదస్సులో నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే జాతీయ పర్యాటక విధానం ముసాయితా పత్రాన్ని సిద్ధం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పర్యాటక, ఆతిథ్య రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఈ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహకారాన్ని కొనసాగిస్తోంది. 2023-2024లో జీ-20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో.. భారతదేశం ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా నిరూపించుకోవాలని యోచిస్తోంది.

యావత్ ప్రపంచాన్ని దేశానికి స్వాగతిస్తున్నప్పుడు తగిన నిబద్ధత, అంకితభావంతోపాటుగా మన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిక్లరేషన్ పేర్కొంది. ఇందుకోసం వీసా సంస్కరణలు, సందర్శకుల ప్రయాణానికి సంబంధించిన నిబంధనల సరళీకరణ, విమానాశ్రయాల్లో వారికి అనుకూలంగా ఉండే ఇమిగ్రేషన్ విధానం మొదలైన అంశాలపై, ధర్మశాలలో రెండ్రోజులపాటు జరిగిన సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది.

భారత పర్యాటక రంగానికి ఏడాదిన్నర (2024 వరకు) లక్ష్యాలు
2024 జూన్-జులై నాటికి కరోనాకు ముందున్న పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలి
• పర్యాటకం నుంచి 150 బిలియన్ డాలర్ల జీడీపీ సహకారం
• 30 బలియన్ డాలర్ల విదేశీ మారకం ఆదాయం
• కోటిన్నర మంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించేలా అంచనాలు

భారత పర్యాటక రంగానికి 2030 నాటికి లక్ష్యాలు
వచ్చే దశాబ్ద కాలంగాల భారతదేశ సీఏజీఆర్ (కాంపౌండ్ యానువల్ గ్రోత్ రేట్) 7-9 శాతంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో 2030 నాటికి కింది లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు వెల్లడి
• పర్యాటక రంగం నుంచి 250 బిలియన్ డాలర్ల జీడీపీ సహకారం
• ఈ రంగంలో 13 కోట్ల 70 లక్షల ఉద్యోగ కల్పన
• 56 బలియన్ డాలర్ల విదేశీ మారక ఆదాయం
• రెండున్నర కోట్ల మంది విదేశీ సందర్శకులు వచ్చేలా లక్ష్యం
2047 నాటికి భారతదేశాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ధర్మశాల డిక్లరేషన్ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement