Tuesday, November 26, 2024

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే సస్పెన్షన్లు.. తొమ్మిదో రోజూ సాగిన టీఆర్ఎస్ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై టీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడుతున్నారు. తెలంగాణకు వరద సాయం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ పెంపు, ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలపై చర్చించాలని కోరుతూ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో గురువారం కూడా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. తమ సహచర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కేంద్రం సంఖ్యా బలం చూసుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని నామా నాగేశ్వరరావు ఆరోపించారు. బీజేపీ వైఖరిని దేశమంతా గమనిస్తోందన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యoగా వ్యవహరించడమేమిటని కేంద్రాన్ని నిలదీశారు. ఉభయసభల్లో సమావేశాలు ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలు, వివక్ష ఎంపీలు ప్లకార్డులతో ఆందోళన కొనసాగించారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనా కూడా అదే పరిస్థితి కొనసాగింది. టీఆర్‌ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్.సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్ధిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావు, బండి పార్ధసారధి రెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతు కవిత, బొర్లకుంట వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్ తదితరులతో పాటు విపక్ష ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ఎంపీలకు కేటీఆర్ అభినందనలు

దేశంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై దాదాపు పదిరోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి, జీఎస్టీ పెంపు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర సమస్యలపై చర్చించాలని కోరారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement