తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటు పడింది. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను కేరళలోని విజయన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ కే గోపాలకృష్ణన్, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రశాంత్‌పై క్రమశిక్షణా చర్యల కింద వేటు వేశారు. మతం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపును గోపాలకృష్ణన్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఓ సీనియర్ అధికారిపై ఆరోపణలు చేసి తీవ్రంగా విమర్శించిన ఘటనలో ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేరళ సీఎం పినరయి విజయన్ ఈ చర్యలు తీసుకున్నారు. 2013 బ్యాచ్ ఆఫీసర్ అయిన గోపాలకృష్ణన్.. మల్లు హిందూ ఆఫీసర్స్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపు నడుపుతున్నారు.
అయితే తన ఫోక్ హ్యాక్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఆ ఫోన్ హ్యాక్ కాలేదని నిర్ధారించారు. వివాదం నేపథ్యంలో ఆ ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. అదనపు కార్యదర్శి ఏ జయతిలక్‌పై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన 2007 బ్యాచ్ ఆఫీసర్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నారు. సీనియర్ ఆఫీసర్ ఓ సైకో అంటూ ఆయన ఆ పోస్టులో ఆరోపించారు.