Friday, November 22, 2024

Hyd: మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు..

మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోప‌ణ‌ల‌తో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై పోలీసు శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సీఐని సస్పెండ్ చేసినట్లు సీపీ కార్యాలయం వెల్లడించింది.

బాధితుల కథనం ప్రకారం.. నాగేశ్వ‌ర్ రావు ఈనెల 7వ తేదీన హ‌స్తినాపురం శ్రీ వెంక‌టేశ్వ‌ర కాల‌నీలో నివాస‌ముంటున్న ఓ మ‌హిళ ఇంటికి వెళ్లాడు. రాత్రి స‌మ‌యంలో భ‌ర్త ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వెంట‌నే వారి ఇంట్లోకి సీఐ ప్ర‌వేశించాడు. భ‌ర్త తిరిగొచ్చే వ‌ర‌కు భార్య‌పై సీఐ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య‌పై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భ‌ర్త‌ను సీఐ రివాల్వ‌ర్‌తో బెదిరించాడు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆ దంప‌తులిద్ద‌రిని కారులో ఎక్కించుకుని ఇబ్ర‌హీంప‌ట్నం వైపు బ‌య‌ల్దేరాడు. అయితే కారు రోడ్డుప్ర‌మాదానికి గుర‌వ‌డంతో.. సీఐ నుంచి దంప‌తులిద్ద‌రూ త‌ప్పించుకుని, వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement