Thursday, November 21, 2024

కాంగ్రెస్‌లో పీకే చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్.. సోనియా నివాసంలో ప్రత్యేక కమిటీ భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన పార్టీ అగ్రనాయకత్వం, పార్టీ పునరుజ్జీవం అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ అందించిన ప్రజెంటేషన్‌పై అధ్యయనం చేసిన పి. చిదంబరం నేతృత్వంలోని 8 మంది సభ్యుల కమిటీ నివేదికను ఈనెల 21న సోనియా గాంధీకి అందజేయగా, దానిపై సోమవారం చర్చించారు. ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరే అంశం, ఇప్పటికే ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్‌పై భేటీలో సీరియస్గా చర్చించారు. ఈ క్రమంలో పీకే పార్టీలో చేరడం వల్ల కలిగే లాభనష్టాల గురించి అధినేత్రికి సూచనలు చేసినట్టు తెలిసింది.

వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన పార్టీని బయటి నుంచి వచ్చిన వ్యక్తి చేతుల్లో పెట్టడం సరికాదని పలువురు సీనియర్లతో పాటు యువనేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ-ప్యాక్ దేశంలోని పలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తుండడం వల్ల వ్యూహాలు లీకయ్యే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ కిశోర్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. పార్టీలో చేర్చుకోవడమే ఏకాఏకి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి పదవిని ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే పీకే చేరికపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా, మరో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీకి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ – 2024’ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఏఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

పీకే చేరికపై నేతల మౌనం
సోనియా గాంధీ నివాసంలో సమావేశం అనంతరం మీడియా మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, పీకే చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా సరే దాటవేత సమాధానాలు ఇచ్చారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడ్రోజుల పాటు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో నిర్వహించే చింతన్ శిబిర్ గురించిన వివరాలు మాత్రమే ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఆహ్వానితులు మొత్తం కలిపి 400 మందికిపైగా చింతన్ శిబిర్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల అజెండాను ఇప్పటికే సిద్ధం చేయగా, ప్రశాంత్ కిశోర్ చేరిక, ఆయన రూపొందించిన వ్యూహాల అమలుపై కూడా చింతన్ శిబిర్‌లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

రెండ్రోజుల పాటు ప్రశాంత్ కిశోర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే. చంద్రశేఖర్ రావుతో చర్చలు జరిపిన నేపథ్యంలో, ఆయన చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారింది. తాను ఏర్పాటు చేసిన ఐ-ప్యాక్ నుంచి దూరమైనట్టుగా పీకే వర్గం చెబుతున్నప్పటికీ, ఇతర పార్టీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను తెగదెంచుకోనంత వరకు పీకే తన సంస్థకు దూరమైనంత మాత్రాన ఉపయోగం ఉండదని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే చేరికపై నిర్ణయాన్ని ప్రకటించకుండా మౌనం వహించినట్టు తెలుస్తోంది. అయితే నేరుగా ప్రశాంత్ కిశోర్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించకుండా, ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపులో భాగం చేస్తారని, తద్వారా పార్టీపై ఆయనకు గుత్తాధిపత్యం లేకుండా కట్టడి చేస్తారని మరో చర్చ జరుగుతోంది.

టాగోర్ ట్వీట్ల కలకం
ప్రశాంత్ కిశోర్ చేరికపై భిన్నస్వరాలు వినిపిస్తున్న ఏఐసీసీ నేతల్లో కొందరు పరోక్షంగా తమ వైఖరిని బయటపెడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్ చేస్తున్న వరుస ట్వీట్లు ఏఐసీసీలో చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం సాయంత్రం ఆయన చేసిన ట్వీట్ ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్‌ను ఉద్దేశించి చేసినట్టుగా ఉంది. “మన శత్రువుతో స్నేహంగా ఉండేవారిని నమ్మడానికి వీల్లేదు” అనే సూక్తిని పోస్టు చేస్తూ.. “ఇది నిజమేనా?” అంటూ ముక్తాయింపునిచ్చారు. సోమవారం ఉదయం జాతిపిత మహాత్మ గాంధీ బోధించిన సూక్తుల్లో నుంచి ఒకదాన్ని తీసుకుని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. “చిట్టచివరి అవకాశం కూడా లేదన్నంతవరకు ఆశను కోల్పోవద్దు” అన్న అర్థంతో కూడిన ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా పీకే చేరిక విషయంలో మాణిక్యం టాగోర్‌తో పాటు పలువురు యువ నేతలు, కొందరు సీనియర్ నేతలు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -

అలాంటి వ్యక్తిని చేర్చుకుని ఏకంగా పార్టీ స్టీరింగ్ అప్పగిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఓ నేత వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ చేస్తున్న వ్యాపారమే రాజకీయ పార్టీలతో ముడిపడినప్పుడు, ఆయన్ను ఎంతవరకు నమ్మగలం అన్న సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహాలు చివరి నిమిషంలో లీకయ్యే ప్రమాదం లేకపోలేదని, తద్వారా మరింత చేటు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీకేను కేవలం ఓ రాజకీయ వ్యూహకర్తగానే చూడాలని, బయటి నుంచి సేవలు పొందడం వరకే పరిమితం కావాలని పలువురు నేతలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement