మా అధ్యక్షుడు మంచు విష్ణుకు హేమ ఘాటు లేఖ
డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ ను పంపిన నటి
తనపై మీడియాలో వచ్చిన వార్తలతో చర్యలా
బాధితురాలికి అండగా నిలవాల్సిన మీరే
శిక్ష వేస్తారా.. ఇదేక్కడి న్యాయం
బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంతో చిక్కులపాలైన నటి హేమ తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు సంచలన లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో ఈ లేఖను సోమవారం స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. రేవ్ పార్టీ విషయంలో తనపై అసత్య ప్రచారం జరిగిందని, మీడియా కథనాల ఆధారంగా తన సభ్యత్వంపై వేటువేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తన వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని, అందులో నెగిటివ్ వచ్చిందని హేమ పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ ను కూడా మంచు విష్ణుకు అందజేశారు. మీడియాలో వచ్చిన వార్తలు ఆధారంగా శిక్ష వేయడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. బాధితురాలినైన తనకు అండగా నిలబడాల్సిన మీరే శిక్ష విధించారంటూ దెప్పిపొడిచింది. తనపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు.
మా లో తన సభ్యత్వం తొలగింపును నటి హేమ తప్పుబట్టారు. మా బైలాస్ ప్రకారం తనకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చెయ్యాలని, తన వివరణ కోరాలని చెప్పారు. నోటీసులకు తాను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోతే అప్పుడు సభ్యత్వం రద్దు చేయాలని వివరించారు. కానీ తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అసోసియేషన్ నుంచి తీసేశారని గుర్తుచేశారు. కాగా, హేమ లేఖను అందుకున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. హేమ లేఖను మా అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, కమిటీ లో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని హేమకు హామీ ఇచ్చారు.