Friday, November 22, 2024

సూర్యనే టాప్‌ టీ20 బ్యాటర్‌.. రెండు స్థానాలు పడిపోయిన కోహ్లీ ర్యాంక్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విభాగంలో టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్‌ కప్‌ టోర్నీలో 239 పరుగులు చేసిన సూర్య, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ చెలరేగాడు. ఆ సిరీస్‌లో అతను 124 రన్స్‌ చేశాడు. మౌంట్‌ మౌంగనీలో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ 111 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. సూర్యకుమార్‌ 890 పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 836 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

- Advertisement -

భారత్‌తో సిరీస్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించిన డెవాన్‌ కాన్వే ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ నాలుగో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ర్యాంక్‌ మరింత దిగజారింది. టీ20 వరల్డ్‌ కప్‌-2022లో 4 హాఫ్‌ సెంచరీలు చేసిన కోహ్లీ ర్యాంక్‌ పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత వారం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న కింగ్‌… తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొనకపోవడం కూడా కోహ్లీ ర్యాంక్‌ పడిపోవడానికి కారణమైంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ 3 స్థానాలు దిగజారి 21వ స్థానంలో, కేఎల్‌ రాహుల్‌ రెండు స్థానాలు కోల్పోయి 19వ ప్లేస్‌లో ఉన్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే… శ్రీలంక స్పిన్నర్‌ హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా… రషీద్‌ఖాన్‌, అదిల్‌ రషీద్‌ వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా నుంచి టాప్‌-10 బౌలర్లలో ఒక్కరూ లేకపోవడం చింతించదగ్గ విషయం. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేవ్‌ స్కిప్పర్‌ షకీబ్‌ టాప్‌లో కొనసాగుతుండగా, మహ్మద్‌ నబీ, హార్దిక్‌ పాండ్యా 2, 3 స్థానాల్లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement