Saturday, November 23, 2024

ప్రాణాలు పోయినా రష్యాకు లొంగేదే లేదు, ఎంత వరకైనా వెళ్తాం: జెలెన్‌ స్కీ

రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పష్టం చేశారు. రష్యాకు తమ సత్తా ఏంటో చూపుతామని ఆయన తేల్చి చెప్పారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా విజయం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ను సభ్య దేశాలు మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి ఈయూ సభ్య దేశాలతో పాటు రష్యా యుద్ధంతో శక్తివంచన లేకుండా పోరాడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో జెలెన్‌ స్కీ చేసిన ప్రసంగానికి ఈయూ దేశాలు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చాయి. ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలిచే దిశగా చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌తో జెలెన్‌ స్కీ ఈయూ పార్లమెంట్‌కు వెళ్లారు. రష్యా సేనలతో తమ దేశ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని జెలెన్‌ స్కీ స్పష్టం చేశారు.

ఈ పోరాటంలో ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. తాము తమ భూమి కోసం పోరాడుతున్నామని, స్వేచ్ఛ కోసం యుద్ధం చేస్తున్నామని తెలిపారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని, తమ పిల్లలు క్షేమంగా జీవించాలన్నదే తమ కోరిక అన్నారు. పుతిన్‌ ఓ అధ్యక్షుడేనా..? అని ప్రశ్నించారు. అసలు పుతిన్‌ లక్ష్యం ఏంటి..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. జెలెన్‌ స్కీ మొత్తం ప్రసంగం విన్న తరువాత.. ఈయూ దేశాల ప్రతినిధులు లేచి నిలబడి అభినందించారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు ఉక్రెయిన్‌ జెండాలు చేతపట్టుకుని కనిపించారు. మరికొంత మంది ఉక్రెయిన్‌ జాతీయ జెండాలతో కూడి టీ షర్టులు ధరించి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement