- ఎమ్మెల్యేలతోపాటు ఆశావాహుల్లో టెన్షన్
- ఇప్పటికే అధికార భారాస పలుమార్లు సర్వేలు
- సర్వే ఆధారంగానే టికెట్టు ఇస్తామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
- రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు
- తమకు అనుకూలమా.. వ్యతిరేకమా అంటూ లెక్కలు వేసుకుంటున్న వైనం
- తమకు తాము సర్వేలు చేయించుకుంటున్న ఆశావాహులు
- ఈసారి పక్కాగా బరిలో దిగేలా ప్లాన్ చేసుకుంటున్న వైనం
(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి) : అధికార పార్టీతోసహా ప్రతిపక్ష పార్టీలు సర్వేల ఆధారంగానే టికెట్టు కేటాయించడం పక్కాగా మారింది. సర్వే ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్టు ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సర్వేలు ఎవరికి అనుకూలంగా వస్తున్నాయి. ఎవరికీ వ్యతిరేకంగా వస్తున్నాయనేది అందరిలో టెన్షన్‌కు గురి చేస్తోంది. ఇటు సిట్టింగ్‌లతోపాటు ఆశావాహుల్లో సర్వే టెన్షన్ నెలకొంది. వచ్చే సాధారణ ఎన్నికలను అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మూడవసారి విజయం సాధించాలనే పట్టుదలతో అధికార భారాస ఉండగా ఈసారి తెలంగాణలో పాగా వేయాలనే ఉత్సాహంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలున్నాయి. మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనాఅంటూ ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సర్వేలో నెగ్గిన వారికే టికెట్టు వస్తుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే సర్వే రిపోర్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మరికొన్ని మాసాల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పెద్దఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం మూడవసారి విజయం మాదేననే ధీమాతో అధికార భారాస ఉంది. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అవే ఫలితాలు తెలంగాణలో వస్తాయనే గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ గాలి వీస్తున్నందునా తామే అధికారంలోకి వస్తామనే లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ నేతలు. మొత్తం మీద ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. గతసారి 2018 డిసెంబర్‌లో అసెంబ్లిd ఎన్నికలు జరిగాయి. ఇందులో భారాస ఘన విజయం సాధించి రెండవసారి అధికారాన్ని చేపట్టింది. ఎన్నికలకు ఇంకా ఏడుమాసాల గడువుంది ఆలోపు కూడా ఎన్నికలు జరగవచ్చు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమతమ క్యాడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందరూ ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు.
సర్వేల్లో ముందున్న అధికార భారాస..
సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. సర్వేల ఆధారంగా టికెట్టు ఇస్తామని ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. సర్వేలు చేయిస్తున్నారు. సర్వే వివరాలు మాత్రం బయటకు చెప్పడం లేదు. గతంలో కూడా సర్వేలు చేయించారు. సర్వేల ఆధారంగానే టికెట్టు ఇచ్చారు. గతంలో సర్వేలో వ్యతిరేకత వచ్చిన వారికి టికెట్టు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు సిట్టింగ్‌లకు మాత్రమే టికెట్టు ఇవ్వలేదు. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్టు ఇవ్వలేదు. మేడ్చల్ నియోజకవర్గం నుండి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వికారాబాద్ నుండి సంజీవరావు, మల్కాజ్‌గిరి నుండి కనకారెడ్డిలకు టికెట్టు నిరాకరించారు. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు.ముగ్గురూ విజయం సాధించారు. ఇందులో మేడ్చల్ నుండి విజయం సాధించిన చామకూర మల్లారెడ్డి ఏకంగా మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి మాత్రం చాలా సర్వేలు చేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రానున్న ఎన్నికల్లో కీలకం కానుంది. ఇక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటే అధికారంలోకి రావడం పక్కా. అదే వ్యూహంతో అధికార భారాస ముందుకు సాగుతోంది. రెండుమూడు సర్వేలు చేయించిన తరువాత ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్టు ఇవ్వడం పక్కాగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొందరు సిట్టింగ్‌ల టికెట్టు దొరకపోవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది.
సర్వేల వైపు కాంగ్రెస్ మొగ్గు..
ప్రతిపక్ష కాంగ్రెస్‌లో ఢిల్లిలో టికెట్లు ఖరారు అవుతుంటాయి. అక్కడ లాబీయింగ్ చేసుకునే వారికే టికెట్టు వస్తుందనే ప్రచారం ఉంది. అందుకే చాలామంది రాష్ట్ర నాయకులతో టచ్‌లో లేకపోయినా ఢిల్లి పెద్దల ఆశీర్వాదంతో టికెట్లు దక్కించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. సర్వేల ఆధారంగానే టికెట్టు కేటాయించడం గ్యారంటీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఢిల్లిలో ఫైరవీలు చేసుకుంటే టికెట్లు రావని సర్వేల ఆధారంగానే టికెట్టు ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో లాబీయింగ్ చేసే నేతలు తలలు పట్టుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అవే ఫలితాలు రాష్ట్రంలో కూడా వస్తాయనే నమ్మకంతో టీపీసీసీ ఉంది. పలు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు కూడా చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే క్లీయర్‌గా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ కూడా టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీలనుండి భలమైన అభ్యర్థులు వస్తే తప్పా మిగతా అన్ని ప్రాంతాల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి రాష్ట్రంలో పాగా వేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
బీజేపీలో అభ్యర్థుల వేట..
హైదరాబాద్ మహానగరం చుట్టూరా ఉన్న నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు వస్తాయనే లెక్కలు వేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చుట్టూరా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తరించింది. అందులో భాగంగానే ఈ జిల్లాలో హైకమాండ్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. దేశంలో నంబర్2గా వెలుగొందుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.మరిన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నారు. గత ఏడాది మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ వద్ద బహిరంగసభ ఏర్పాటు చేశారు. తాజాగా గత మాసంలో చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మరో బహిరంగసభ ఏర్పాటు చేశారు. రెండింటికి కూడా అమిత్‌షా హాజరయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. వారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో ఎంతమేర విజయం సాధిస్తారనేది వేచి చూడాలి. వీళ్లు కూడా నియోజకవర్గాల వారీగా సర్వేలకు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పరిస్థితి. అభ్యర్థి ఎవరుంటే విజయం సాధిస్తారనే దానిపై సర్వేలు చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం మీద అధికార భారాసతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించడం పక్కాగా కనిపిస్తోంది. సర్వే ఎంతమందికి ప్రయోజనం కలిగిస్తుంది…ఎంతమందికి నష్టం కలిగిస్తుందనేది వేచి చూడాలి.