Tuesday, November 26, 2024

చిట్టీలపై నిఘా, దేశంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగం.. టీ చిట్స్‌ పేరుతో నయా విధానం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చిట్టీల పేరుతో ప్రజలు మోసపోకుండా రిజిస్ట్రేషన్ల శాఖ దేశంలో ఎక్కడాలేని రీతిలో పకడ్బంధీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. టీ-చిట్స్‌ పేరుతో నయా యాప్‌ను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి వేముల వ్రీనివాసులు స్వయంగా రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, పౌరులు మదుపు చేస్తున్న సొమ్ముకు రక్షణ కల్పించేలా దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్‌ విధానంలో సరికొత్త సాంకేతికతతో ఈ విధానం అమలులోకి తీసుకొచ్చారు. చిట్‌ఫండ్‌ సంస్థలకు నిబంధనల చట్రంతోపాటు, కఠినమైన నిర్ణయాలను రూపొందించారు. అంతేకాకుండా సకాలంలో సొమ్ములు చెల్లించేలా కీలక సిఫార్సులను ఇందులో చేర్చారు. గతంలో ఉన్న విదివిధానాల్లో లోపాల కారణంగా అక్రమాలతో యధేచ్చగా ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలకు చెక్‌ పెట్టేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఎన్ని చిట్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరెవరు సభ్యులు, వారెంతెంత చెల్లించారు.

ఏఏ తేదీల్లో చెల్లించారు. చిట్టిని పాడిన వారెవరు..వారికి చెల్లించింది ఎప్పుడు, కంపెనీ రిజిస్ట్రేషన్‌, వారి ఖాతా, బ్యాంకు నిల్వ, ఆర్ధిక పరపతి, ఎంత చిట్టీ నిర్వహిస్తే అంత మొత్తానికి ప్రభుత్వం వద్ద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేలా అనేక సంస్కరణలను అమలులోకి తెచ్చారు. దీంతో పారదర్శకత పెరిగింది. ఇందులో 703 కంపెనీలు రిజిస్ట్రేషన్‌లు చేసుకోగా వాటికి చెందిన 1422 బ్రాంచీలు రిజిస్టర్‌ అయ్యాయి. ఇంకా మరో 5 వేల కంపెనీలు కూడా త్వరలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశాలున్నాయి. ఈ 703 కంపెనీలు 18239 గ్రూపులతో చిట్టీలను నిర్వహిస్తున్నాయి. నెలకు దాదాపుగా వీరి టర్నోవర్‌ రూ. 1289కోట్లుగా నమోదైంది. అయితే 18205 గ్రూపులు ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో క్షణాల్లో వాటి వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్గుతోంది. వీటి మొత్తం సమాచారం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ఈ వెబ్‌సైట్‌లో కంపెనీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ మొదలుకొని జీఎస్టీ నెంబర్‌, బ్రాంచీలు, ఫోన్‌ నెంబర్లు, ఆథరైజ్‌డ్‌ వ్యక్తుల వంటి అనేక సమాచారంతో నిఘా పెడుతున్నారు. దీంతో నియంత్రణలు అమలులోకి వచ్చి మోసాలకు వీలు లేకుండా పోతోంది. ఇన్నాళ్లూ చిట్టీల వ్యవహారంపై అధికారం లేకుండా పోయిన రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పుడీ కొత్త ఆయుధంతో ప్రజలకు మేలు చేసే అవకాశం విస్తృతమైంది. ఆడిటర్‌లు ఎవరు, సభ్యుల జాబితా, బిడ్‌ ఆథరైజేషన్‌, చెల్లింపుల వంటి సుమారు 30 రకాల డాక్యుమెంట్లను ఇందులో పొందుపరుస్తారు.

అయితే చిట్‌ఫండ్‌ల రిజిస్ట్రేషన్‌లకు ప్రభుత్వం నామమాత్రపు రుసుములనే వసూలు చేస్తోంది. అయినప్పటికీ చిట్‌ఫండ్‌ సంస్థలు, అసంఘటిత సంస్థలనుంచి స్పందన కరువవుతోంది. మొదటగా ఈ పథకాన్ని పైలట్‌గా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అమలు చేశారు. ఆ తర్వాత అక్కడి ఫలితాలను చూసి క్రమంగా రాష్ట్రమంతటా అమలోకి తీసుకొచ్చారు. గతేడాది మే 1నుంచి ఇది రాష్ట్రమంతటికీ విస్తరించింది. రాష్ట్రంలో అనధికారికంగా చిట్టీల పేరుతో భారీ వ్యాపారమే నడుస్తోంది. మారుమూల గ్రామాల్లో మొదలుకొని నగరాలు, పట్టణాల్లో కూడా ఈ వ్యాపారం వృద్ధిచెందుతోంది. అనేక మంది వీటిని ఎటువంటి రిజిస్ట్రేషన్‌లు లేకుండా నిర్వహిస్తున్నారు. అనధికారికంగా రూ. 40కోట్లకుపైగా టర్నోవర్‌ జరుగుతుందని ఒక అంచనా. ఇటువంటి వ్యాపారాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎటువంటి యంత్రాంగం లేకపోగా, పోలీస్‌ స్టేషన్లలో కేసులు సుధీర్ఘంగా నడుస్తున్నాయని, ప్రజలకు మేలు జరగడంలో తీవ్ర జాప్యం, ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని గుర్తించిన రిజిస్ట్రేషన్ల శాఖ కొరడా ఝులిపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement